హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇండ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. శనివారం ఆమె మంచిర్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదల ప్రయోజనం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.58, 59, 76 కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిషరించాలని ఆదేశించారు.
ఈ నెలాఖరు నాటికి మూడు జీవోలకు సంబంధించిన అంశాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద తదితరులు పాల్గొన్నారు.