హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్ననట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇప్పటికే నాలుగు జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి వెంటనే సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు ఆయా జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేశామని వెల్లడించారు. మిగిలిన 25 జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున విడుదల చేస్తామని చెప్పారు.
శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై, చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు, అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమావేశం ఉంటుందని, జిల్లాలవారీగా జరిగిన నష్టాలపై సమగ్ర నివేదికను అదే రోజు మధ్యాహ్నం లోగా స మర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.