హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల మహిళలతో సోలార్ పవర్ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పలు పథకాలపై సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలిదశలో భాగంగా వచ్చే ఆరు నెలల్లో ఐదు జిల్లాల్లో 231 ఎకరాల్లో ప్లాంట్లు ఏర్పాటుచేయాలని స్పష్టంచేశారు.
ఖాళీగా ఉన్న దేవాలయాల భూములను లీజుకు తీసుకొని ప్లాంట్లు ఏర్పాటుచేయాలని, మహిళా సంఘాలతో 150 ఎలక్ట్రిక్ బస్సులను సేకరించి వాటి నిర్వహణ బాధ్యతను ఆర్టీసీకి అప్పగించాలని సూచించారు. జూన్ చివరిలోగా జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. మాదాపూర్లోని ఇందిరా మహిళాశక్తి బజార్లో జనవరి 25లోగా సరస్ మేళా నిర్వహణకు చర్యలు చేపట్టాలని సూచించారు.