Shanti Kumari | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూముల్లో చెట్ల నరికివేతపై కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆగ్రహంతో ఉందన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. అటవీ చట్టాలను ఉల్లంఘించి 121 ఎకరాల్లో రాత్రికి రాత్రే చెట్లు నరికివేయడంతో జంతువులు రోడ్ల మీదికి వచ్చి కుక్కల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానంలో ఈనెల 16న కేసు విచారణకు రానున్నది. దీంతో ఏం జరుగనున్నదో అని రాష్ట్ర ఉన్నతాధికారుల్లో ఉత్క ంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఈ కేసులో కీలమైన అధికారులైన అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, సలహాదారు శ్రీనివాస్‌రాజు, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావు సహా పలువురు అధికారులు ఢిల్లీ వెళ్లారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సాధికార కమిటీ కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించింది. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలను ఈనెల 14 వరకు సుప్రీంకోర్టుకు నివేదించనున్నట్టు సమాచారం. ఒకరిద్దరు ఉన్నతాధికారులపై కఠిన చర్యలకు కమిటీ సిఫారసు చేస్తుందనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించాల్సిన అఫిడవిట్‌పై న్యాయ సలహాల కోసం వారు ఢిల్లీ వెళ్లినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నెలోనే సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ డోబ్రియాల్ పదవీ విరమణ పొందుతున్నారు. సాధారణంగా ఇలాం టి కేసులు విచారణ ముగిసేంత వరకు సంబ ంధిత అధికారులను బాధ్యతల నుంచి తప్పించవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశాలు ఉంటాయని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయపరమైన చి క్కులు ఎదురుకాకుండా అడ్వకేట్స్ సలహా కోసమే ఉన్నతాధికారుల బృందం ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది.