హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు ప్రాధాన్యతాక్రమంలో జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో రోడ్లు, భవనాల శాఖ పనులపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన రోడ్ల అభివృద్ధి, ఆ శాఖ పునర్వ్యవస్థీకరణ వివరాలను ఆ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు తెలియజేశారు. ఆర్అండ్బీ పునర్వ్యవస్థీకరణతో ఏఈ, ఏఈఈ పోస్టు లు పెరిగాయని చెప్పారు. 2014లో జాతీయ రహదారుల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 2.25 కిలోమీటర్లే ఉండగా, ఇప్పుడు 4.45 కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు. అలాగే, తొమ్మిదేండ్లలో టూ లేన్ రోడ్లు, అంతకన్నా ఎక్కువ వెడల్పుగల రోడ్లను కూడా గణనీయంగా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 2014లో డబుల్ లేనింగ్ రోడ్లు 6093 కిలో మీటర్లు ఉండగా, ఇప్పుడు 12060 కిలో మీటర్లకు పెరిగినట్టు వివరించారు. సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి బీ విజయేంద్ర, ఈఎ న్సీ పీ రవీందర్రావు పాల్గొన్నారు.