హత్యలు, లైంగికదాడులు.. పంజా విసురుతున్న విషజ్వరాలు! వానలు పడి కొన్నిచోట్లా ప్రమాదకరస్థాయికి వరదలు, మరికొన్నిచోట్లా కరువుఛాయలు. సుంకిశాల లాంటి నిర్వహణా వైఫల్యాలు. గురుకులాల్లో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు! రోడ్డెక్కుతున్న నిరుద్యోగులు! దిక్కుతోచని స్థితిలో రైతాంగం! రగులుతున్న ఉద్యోగులు! ఇదీ రాష్ట్రంలో పరిస్థితి.
ప్రభుత్వం మాత్రం ప్రవాసంలో ఉన్నది. సీఎం సహా సీఎస్, మంత్రులు అమెరికా పర్యటనలో ఉన్నారు. కీలక శాఖల ఉన్నతాధికారులూ అక్కడే ఉన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసింది. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేవారు లేక ఫైళ్లు మూల్గుతున్నాయి. రెండు వారాలపాటు ఇదే పరిస్థితి.
Congress Govt | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలన పడకేసిందా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. కీలక అధికారులు, మంత్రులందరూ విదేశీ పర్యటనలో ఉండడంతో రాష్ట్రంలో పాలన అటకెక్కింది. నిన్నమొన్నటి వరకు ఢిల్లీకి వెళ్లిరావడంతోనే ముఖ్యమంత్రి, మంత్రులకు సరిపోయేది. వారానికి ఒక్కసారి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఢిల్లీ పర్యటనలకు వెళ్లేవారు. ఇప్పుడు సీఎం సహా కీలక మంత్రులు, అధికారులు అమెరికా బాటపట్టారు. రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, వరదలు.. మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్ల లొల్లి జరుగుతున్నది. ఇదంతా ఒకెత్తయితే అనేక శాఖల్లో అధికారులు, సిబ్బంది బదిలీల ప్రహసనం సాగుతున్నది. ఇలాంటి కీలక సమయంలో సీఎం సహా అందరూ విదేశీ పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒకేసారి ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రం దాటి వెళ్లడం ఉండదు. ఇప్పుడు వీరెవరూ రాష్ట్రంలో లేకపోవడంతో ముఖ్యమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారన్న ప్రశ్న ఎదురవుతున్నది. ముఖ్యమంత్రి అయిన 8 నెలల్లోనే రెండుసార్లు విదేశీ పర్యటన చేసిన రికార్డు రేవంత్‌కే దక్కుతుందని చెప్తున్నారు.
వెళ్లింది వీరే..
శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే గత శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. ఆ తర్వాత మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అమెరికా బాటపట్టారు. త్వరలోనే మరో మంత్రి దామోదర రాజనర్సింహ కూడా అమెరికా వెళ్తున్నారని సమాచారం. ముఖ్యమంత్రి తాను వెళ్లడమే కాకుండా తనతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను వెంటపెట్టుకెళ్లారు. పరిశ్రమలశాఖ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎంవో అధికారులు శేషాద్రి, అజిత్‌రెడ్డి తదితరులుకూడా వెళ్లారు.
అమెరికా పర్యటనలో సీఎస్ కూడా!
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా సీఎంతో అమెరికా పర్యటనకు వెళ్లారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎంతో విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భాలు లేవు. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో అత్యవసర అంశాలను హ్యాండిల్ చేయడం, యంత్రాంగానికి సంబంధించి నిర్ణయాలను తీసుకోవడం సీఎస్ విధి. కేంద్రంలో ప్రధాని లేని సమయంలో క్యాబినెట్ సెక్రటరీ ఆ విధులను పర్యవేక్షిస్తారు. సీఎస్ వెళ్తే ఆ స్థానంలో మరో అధికారికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రోజువారీ కార్యకలాపాలను అమెరికా నుంచే సీఎస్ పర్యవేక్షిస్తున్నారు.
రోజువారీగా చూడాల్సిన ఫైళ్లు, ఇవ్వాల్సిన సూచనలు, సమావేశాలు సీఎస్ తిరిగి వచ్చేవరకు నిలిపివేసినట్టే. చీఫ్ సెక్రటరీ తర్వాత ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టు కీలకమైంది. ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో అటు సీఎస్ వద్ద, ఇటు ఆర్థికశాఖలో అనేక ఫైళ్లు నిలిచిపోయినట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయం వద్ద ప్రతీ రోజు వందలాది మంది ఉద్యోగులు, చిన్నచిన్న కాంట్రాక్టర్లు తమ బిల్లులను విడుదల చేయించుకోవడానికి వేచి ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. మరో వారం రోజులపాటు అధికారుల విదేశీ పర్యటనలున్నాయి. వాళ్లు వచ్చేవరకు ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి.