నందికొండ, జూలై 1 : నాగార్జునసాగర్ డ్యాంపై భద్రత నిర్వహిస్తున్న 234 సీఆర్పీఎఫ్ బెటాలియన్ బలగాలను డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎన్ఎస్పీ ఇన్చార్జి ఎస్ఈ మల్లికార్జునరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నాగార్జునసాగర్ డ్యాం విషయంలో డ్యాం 13వ గేటు వరకు తెలంగాణ వైపు 39వ బెటాలియన్, 13వ గేటు నుంచి 26 గేటు అవతలి వరకు ఏపీ వైపు 234వ బెటాలియన్ను కేంద్రం నియమించింది.
ఏప్రిల్లో తెలంగాణ వైపు ఉన్న 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్ విధులను ఉపసంహరించుకొని వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఏపీ వైపు ఉన్న 234వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ పూర్తిస్థాయిలో డ్యాంపై విధులు నిర్వహిస్తున్నది. కేఆర్ఎంబీ బోర్డు సమావేశంలో సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించి డ్యాంను తమకు స్వాధీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా, అందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో డిసెంబర్ 30 వరకు సీఆర్పీఎఫ్ బలగాలను కొనసాగించేలా కేంద్రం నుంచి అదేశాలు వచ్చాయి.