చేర్యాల, సెప్టెంబర్ 4 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పోటెత్తింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 12 వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.
శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేశాయి.