చేర్యాల, జనవరి 1 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం (Mallanna temple)బుధవారం భక్తులతో(Devotees) కిటకిటలాడింది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు కొమురవెల్లికి తరలివచ్చినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు కావడంతో సైతం చేర్యాల, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, జనగామ, బచ్చన్నపేట, కరీంనగర్ తదితరల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు.
కాగా, ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకునే భక్తులు వేకువజామునే మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. కోనేటిలో పవిత్ర స్నానం ఆచరించి, నేరుగా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారిని దర్శించుకుని కోరికలు తీర్చాలని వేడుకున్నారు. మరికొంత మంది భక్తులు అర్చన, ప్రత్యేక పూజలు, కేశఖండన, నజరు, మహామండపం, చిలుక పట్నం, బోనం, టెంకాయలు, హుండీలలో కానుకలు వేసి మొక్కులు తీర్చుకున్నారు . గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.