హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 6 వేల ఎకరాల్లో హరితహారం కింద కోటి మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం కావాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశించారు. కాలువల వెంట 10 వేల కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. బుధవారం నగరంలోని జలసౌధలో సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. రజత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న హరితహారంలో ఈసారి ఇరిగేషన్ శాఖను అగ్రస్థానంలో నిలపాలని కోరారు. వర్షాలు కురవగానే మొక్కలు నాటేందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్రావు, చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈలు పాల్గొన్నారు.