హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): అసోం రాష్ట్రంలో 2030 నాటికి కోటి మొక్కలు నాటనున్నట్టు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ వెల్లడించారు. అసోంలోని తముల్పూర్లో ఆదివారం గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ జాదవ్ పాయెంగ్, స్థానిక ఎమ్మెల్యే జోలెన్ దోయినరీతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సంతోష్‌కుమార్ మాట్లాడుతూ నిరుడు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 2.5 లక్షల మొకలు నాటామని సంతోష్‌కుమార్ తెలిపారు. పద్మశ్రీ జాదవ్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.
స్థానిక సంస్థలు, ఎన్జీవోల సహకారంతో 2030 నాటికి అసోంలో కోటి మొకలు నాటాలని నిర్ణయించినట్టు తెలిపారు. మజులీ ప్రాం తంలో జాదవ్ మొకలు నాటి అభివృద్ధి చేసిన మలైకోతాని తరహాలో మియావాకి విధానంలో చికటి అడవుల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తామని, తద్వారా తూర్పు హిమాలయాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడుతామని వివరించారు. ఇందుకు నవోదయ సంస్థ సహకారం తీసుకుంటామని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టిన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ కృషి అభినందనీయమని పద్మశ్రీ జాదవ్ కొనియాడారు. కార్యక్రమంలో తముల్పూర్ జిల్లా కలెక్టర్ బికాస్ భగవత్, ఇగ్నైటింగ్ మైండ్స్ నుంచి రీతు రాజ్ పుకాన్, నవోదయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్‌రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.