SRSP | కరీంనగర్ ప్రతినిధి, మార్చి 12 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు వంకలు పెట్టిన ఈనాటి కాంగ్రెస్ సర్కారు.. ఎస్సారెస్పీ నీటిని సైతం సరిగా వాడుకోలేకపోయింది. ప్రణాళికాలోపంతో ఎస్సారెస్పీ నుంచి వందకు పైగా టీఎంసీలను సముద్రం పాలుజేసింది. ఫలితంగా ఎస్సారెస్పీ చివరి ఆయకట్టులో వేలాది ఎకరాల్లో పంటలు ఎండుముఖం పట్టాయి. దీని పరిధిలోని దాదాపు 80 శాతం చెరువులు అడుగంటిపోయాయి. కండ్లముందే పంటలు ఎండిపోతున్నా, వాటిని కాపాడేందుకు మార్గాలు న్నా కాళేశ్వరంపై కక్షసాధింపు చర్యలతో ప్రభు త్వం ముందుకెళ్తున్న తీరుపై రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సర్కారు తేరుకపోకపోతే మరో వారం, పదిరోజుల్లో ఎండిపోయే పంటలు వేలాది ఎకరాలు దాటి.. లక్షలకు చేరే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో చె రువులను కాపాడాలన్నా, చివరి ఆయకట్టుకు నీరు అందాలన్నా ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం.. కాళేశ్వరం నీటిని ఎత్తిపోయడమేనని నిపుణులు చెప్తున్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో ఎండుతున్న పంటలు, ప్రభుత్వ వైఫల్యంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఆయకట్టు పరిధిలో 2,142 చెరువులు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజీ-1, 2 కింద నిజమాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో 2,142 చెరువులు ఉన్నాయి. ఎస్సారెస్పీ ఆయకట్టేతర పరిధి మండలాల్లోనూ కొన్ని చెరువులు ఉన్నాయి. కొన్నిచోట్ల ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంతోపాటు ఇతర ఐడీసీ స్కీమ్‌ల ద్వారా నింపే చెరువులూ ఉన్నాయి. ఈ చెరువులన్నింటినీ కేసీఆ ర్ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం నింపుతూ వచ్చింది. ఎస్సారెస్పీలో నీటి సౌలభ్యం ఉన్నప్పుడు, ప్రాజెక్టు నీటిని డిస్ట్రిబ్యూటరీల ద్వారా విడుదల చేసి, తూముల ద్వారా చెరువులను నింపుతూ వచ్చింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎస్సారెస్పీలో నీటి వనరులు తగ్గిపోతే, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువతోపాటు, ఇతర కాలువలను ఆధారంగా చేసుకొని, నీటిని ఎగువకు తీసుకొచ్చి, చెరువులను నింపుతూ వచ్చింది. చెరువులు, కుంటలతోపాటు ప్రాజెక్టుల కాలువల్లోనూ రిజర్వాయర్ల లాగా ఏడాది పొడవున నీటిని నింపి ఉంచడంతో వరదకాలువతోపాటు ఇతర కాలువల, చెరువుల పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగుతూ వచ్చాయి. 2018 కంటే ముందు ఆయకట్టేతర మండలాల్లో సగటున 14 నుంచి 20 మీటర్ల లోతున భూగర్బజల మట్టా లు ఉండగా, ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకాలతో భూగర్భజలాలు సగటున 4 నుంచి 5 మీటర్ల పైకి ఉబికి వచ్చాయి. చెరువుల పరిధిలోని ఆయకట్టు భూమికి సక్రమంగా సాగునీరు అందుతూ వచ్చింది. చెరువుల కింద సైతం వేల ఎకరాల ఆయకట్టు సాగయింది. ఒక్క జగిత్యాల జిల్లా పరిధిలోనే 1,125 చెరువులు, 96 కుంటల కింద 59 వేల ఎకరాల పైచిలుకు భూమి సాగు అయిందంటే సాగులో చెరువులు ఎంత కీలకంగా వ్యవహరించాయో అర్థం చేసుకోవచ్చు.
మళ్లీ జలకళను కోల్పోతున్న చెరువులు
ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలో నీటి లభ్యత గతం కంటే ప్రస్తుతం అధికంగా ఉన్నప్పటికీ నీటి పంపిణీ యాజమాన్యం విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్, అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 285 టీఎంసీల నీరు వస్తే, 104 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలేశారు. నిరుడు జూన్, జూలైలో ప్రాజెక్టు నుంచి నీటిని బయటకు వదిలిపెట్టనే లేదు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున నీరు రావడంతో ప్రభుత్వం ఆదరబాదరాగా నీటిని వదిలిపెట్టిం ది. ఈ క్రమంలో 100 టీఎంసీల నీరు వృ థాగా వెళ్లిపోయింది. గోదావరిలోకి వదిలిన నీటిని జాగ్రత్తగా పంపిణీ చేసి, ప్రాజెక్టు పరిధిలో ఉన్న 2,000కు పైగా చెరువులను నింపుకునేందుకు అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం పనిచేయకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే 60 శాతం చెరువులు అడుగంటిపోయాయి. డిసెంబర్లో ఎస్సారెస్పీలో నీటి వనరులు ఉన్నప్పటికీ డిస్ట్రిబ్యూటరీలు, వరద కాలువ ద్వారా చెరువుల ను ప్రభుత్వం నింపలేకపోయింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోనూ..ఎల్లపల్లి ప్రాజెక్టు పరిధిలోని చెరువులు సైతం అడుగంటిపోతున్నాయి. ప్రభుత్వ ప్రణాళికాలోపం వల్ల రైతులు తీవ్ర నష్టాలకు గుర య్యే ప్రమాదం ఏర్పడింది.
లక్ష ఎకరాలు ఎండిపోవడం ఖాయం?
ఎస్సారెస్పీ ఫేజ్-2 కింద సూర్యాపేట జిల్లా పరిధిలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో కాలువలు, చెరువులు, కుంటల ద్వారా మొత్తం 2.66 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉన్నది. కేసీఆర్‌తోనే 2018లో ఈ జిల్లాకు తొలిసారి నీళ్లు చివరి ఆయకట్టు వరకు చేరాయి. సమైక్య రాష్ట్రంలో ఏనాడు 45 నుంచి 50 వేల ఎకరాలకు మించి వరి పండించలేదు. కాళేశ్వరం నీళ్లు రావడంతో 2023 వరకు యాసంగిలో వందశాతం వరి పంట పండించారు. ఇప్పటికే చెరువులు, బావులు, బోర్లల్లో నీళ్లు లేకపోవడం, ఎస్సారెస్పీ కాలువల్లో ఇంకా ఒక్క విడత మాత్రమే నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో జిల్లాలోని 2.66 లక్షల ఎకరాలకు గాను 1.50 లక్షల ఎకరాలకు పైనే ఎండిపోవడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం నుంచి చివరి ఆయకట్టు దాదాపు 340 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె, నడిగూడెం, మునగాల మండలాల్లో 42,796 ఎకరాలు ఉండగా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్‌పహాడ్ మండలంలో 13,562 ఎకరాలు కలిపి మొత్తం చివరి నాలుగు మండలాల్లో 56,358 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్లో నీరు రాకపోవ డంతో 30 వేల ఎకరాలు ఇప్పటికే ఎండిపోయింది.
వట్టిపోతున్న గొలుసుకట్టు చెరువులు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆయకట్టేతర ప్రాంతం. ఎస్సారెస్పీ ప్రధాన కాలువతోపాటు వరద కాలువ ఈ మండలం మీదుగానే పోతున్నా, వివిధ గ్రామాలకు సాగునీరు అందడం లేదు. ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ నింపి, దాని ద్వారా ప్రధాన చెరువులు, గొలుసుకట్టి చెరువులను గత ప్రభుత్వం నింపి రైతులను అదుకున్నది. ఈ యేడాది వానకాలం నుంచే గంగాధర మండలంలోని మల్లాపూర్, వెంకంపల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల, కొండన్నపల్లి గ్రామాల రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. చెరువులన్నీ ఎండిపోయాయి. భూగర్భజలాలు అడుగంటిపోయా యి. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని పైప్‌లైన్ ద్వారా కొడిమ్యాల మండలానికి తరలించి తూతూమంత్రంగా చెరువులు నింపారే తప్ప, కొండాపూర్ చెరువు నుంచి నీటిని మల్లాపూర్ చెరువుకు తరలించలేదు. దీంతో మల్లాపూర్ చెరువుతోపాటు దాని దిగువన ఆధారపడిన గొలుసుకట్టు చెరువులన్నీ వట్టిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట ప్రశ్నార్థకంగా మారిపోయింది.
కళ తప్పిన కాలువలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్సారెస్పీ ఆ యకట్టు పరిధిలో పంటలు ఎండిపోతున్నా యి.మొదటి దశలో సంగం మండలం తీగరాజుపల్లి, పర్వతగిరి, నెకొండ మీదుగా డీబీఎం 48 ద్వారా మహబూబాబాద్ జి ల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్, కురవి, డోర్నకల్ మండలం వెన్నారం వర కు గత ప్రభుత్వం సాగునీరు అందించింది. ప్రస్తుతం నీళ్లు రాకపోవడంతో ఈ ప్రాంతం లో వరి సగం పడిపోయింది. రెండో దశలోని డీబీఎం 60 ప్రధాన కాలువ తొర్రూ రు మండలం నాంచారిమడూరు, పటేల్‌గూడెం నుంచి మరిపెడ వరకు 45 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 1,200 క్యూసెకుల నీరు రావాల్సి ఉండగా, 850 క్యూసెకులు మాత్రమే వస్తున్నది. ప్రస్తుతం కాలువ కింద 8,000 ఎకరాలు సాగవుతున్నది. గతంలో 12 వేల ఎకరాల వరకు వరి సాగయ్యేది. ఈ 8 వేలల్లో ఇప్పటికే 2వేల ఎకరాల పంట ఎండిపోయింది. మరో 2,000 ఎకరాలకు నీరందని పరిస్థితి. డీబీఏం 57, 59 కాలువల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉన్నది.