నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 14 : పలు జిల్లాల్లో కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వర్షానికి మిర్చి, మక్కజొన్న పంటలు తడిసిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటపై టార్పాలిన్లు కప్పినప్పటికీ గాలికి లేచిపోయి పంట తడిసిపోయింది. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీపీఎం నాయకులు రైతులను ఆదుకోవాలని కోరారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. పలుచోట్ల కోతకొచ్చిన వరి పొలాలు దెబ్బతిన్నాయి. ఆరబోసిన ధాన్యం తడిసింది. మామిడి, నిమ్మ తోటల్లో కాయలు నేలరాలాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. మహబూబ్‌నగర్‌లో జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి దాదాపు 2 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. రైతులు కాపాడుకునే యత్నం చేసినా ఫలితం లేకపోయింది.