భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ రఘునాథపాలెం, ఏప్రిల్ 13: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట, చండ్రుగొండ, కొత్తగూడెం, రుద్రంపూర్, పాల్వంచ మండలాల్లో వడగండ్లు పడ్డాయి. దుమ్ముగూడెం మండలంలో తాటిచెట్టుపై పిడుగుపడటంతో చెట్టు కాలిపోయింది. చుంచుపల్లి, బూర్గంపహాడ్, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి.
చుంచుపల్లి మండలం పెనగడప కొనుగోలు కేంద్రంలో రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. అన్నపురెడ్డిపల్లి సహా మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లాలోని జనగామ రూరల్, నర్మెట, తరిగొప్పుల, దేవరుప్పుల తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, గాలులతో కూడిన మోస్తరు వానతో మామిడితోటలకు నష్టం వాటిల్లగా కోతకు వచ్చిన వరి పంట నేలపాలైంది. ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట మండలాల్లో గాలి దుమారంతోపాటు వడగండ్లు కురిశాయి.