అర్వపల్లి, ఫిబ్రవరి 26 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు సాగు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక రైతులు పశువులు, గొర్రెలు, మేకలకు మేతగా వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ హృదయ విదారక దృశ్యాలు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. ఎస్సారెస్పీ కాల్వ ద్వారా గోదావరి జలాలు రాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. మండలంలో ఈ యాసంగిలో సుమారు 19 వేల ఎకరాలు నాటు పెట్టగా నీళ్లు లేక రెండు వేల ఎకరాలకు పైగా ఎండిపోయినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
నాకున్న ఎనిమిది ఎకరాలు వరి సాగు చేసిన. గోదావరి నీళ్లు వస్తాయని వేస్తే నీళ్లు లేక ఐదెకరాల వరి పొలం ఎండిపోయింది. దిక్కుతోచని స్థితిలో వదిలేయడంతో చుట్టుపక్కల రైతులు, మేకలు గొర్రెలను మేపుతున్నారు. లక్షా 50 వేలకు పైగా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి నష్టపోయా. మిగిలిన 3ఎకరాలైనా పంట చేతికి వస్తదనే నమ్మకం లేదు. బోరు ఆగి పోస్తున్నది. రెండు రోజులకో తడి ఇస్తున్నా. దానిపై కూడా ఆశలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా పంట ఎండిపోలేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత సాగునీటి కష్టాలు వచ్చినయి. ఎండిన పంటలను పరిశీలించి ప్రభుత్వం పరిహారం అందించాలి.