సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయకట్టు అంతటికీ దేవాదుల నీళ్లు పారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితి మారింది. కాలువల్లో తుప్పలు మొలిచాయి. యాసంగిపై సరైన ప్రణాళిక లేకపోవడం, నిర్వహణ సంస్థకు బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో వారంపాటు నీటి పంపింగ్ జరగలేదు. ఫలితంగా సాగు నీరందక పంటలు ఎండుతున్నాయి.
Devadula Project | వరంగల్, మార్చి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి అష్టకష్టాలు మొదలయ్యాయి. యాసంగి పంటలకు సాగునీరందక అవస్థలు పడుతున్నారు. సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఈ కష్టాలను తెచ్చిపెట్టింది. ఉద్యమకాలంలోనే సాగునీటికోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన పోరాటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీరు అందించే లక్ష్యంతో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మొదలైంది. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో ఏండ్లుగా అది పూర్తికాలేదు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఆయకట్టు అంతటికీ సాగునీరు పారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితి మళ్లీ మారింది. పంటలకు నీళ్లందించే పరిస్థితి లేకుండా పోయింది. యాసంగిలో నీటి సరఫరాపై ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో హనుమకొండ, జనగామ జిల్లాల్లోని దేవాదుల ఆయకట్టు రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. దేవాదుల పైపులైన్ నిర్వహణ సంస్థకు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం చెల్లింకపోవడంతో ఆ సంస్థ తమ ఉద్యోగులకు, సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదు. దీంతో వారంతా విధులకు గైర్హాజరయ్యారు. ఇలా వారంపాటు నీటి పంపింగ్ జరగలేదు. ఇదే దేవాదుల ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. వారంపాటు పంపింగ్ నిలిచిపోవడంతో రిజర్వాయర్లలో పంపింగ్‌కు అనుగుణంగా నీరు నిల్వ ఉండటంలేదు. మొదట వారం రోజులు రిజర్వాయర్లను నింపి తర్వాత పంపింగ్ చేయాల్సి వస్తున్నది. ఈ కారణంగా ఆయకట్టు పొలాలకు అంతంతమాత్రంగానే సాగునీరు అందుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జనగామ జిల్లాలోని పంటలకు దేవాదుల ప్రాజెక్టు నీరు అందడమే లేదు. ఫలితంగా దేవరుప్పుల, బచ్చన్నపేట, పాలకుర్తి మండలాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉన్నది. భూగర్భజలాలు అడుగంటి తడులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
60 శాతం గ్రామాల్లో ఎండుతున్న పంటలు
దేవరుప్పుల మండలంలో 60 శాతం గ్రామాల్లో పంటలు ఎండిపోయాయి. స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్‌పేట రిజర్వాయర్ ద్వారా మండలంలోని వాగు అవతలి గ్రామాలకు నీళ్లు అందాల్సి ఉన్నది. ఇప్పటివరకు దేవాదుల నీటిని వదలడమే లేదు. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ హయాంలో రెండుసార్లు పంటలకు సాగునీరు అందింది. భూగర్భజలాలు పెరిగి బోర్లలో నీరుండేది. పదేండ్లు చెరువులు నింపారన్న భరోసాతో రైతులు ఈసారి పంటలు వేశారు. ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. పాలకుర్తి మండలంలోని కోతులబాధ, ఈరవెన్ను, శాతాపురం, మాధాపురం, ధర్మాపురం గ్రామాల్లో ఆలస్యంగా దేవాదుల నీటిని విడుదల చేశారు. కాలువలు లేని గ్రామాల్లో భూగర్భజలాలు పడిపోయి బోర్లు నీళ్లు పోయడమే లేదు. బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట, అలీంపూర్, పోచన్నపేట, రామచంద్రాపూర్, కొన్నె చెరువుల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.
లక్నవరం చెరువుకు చేరని నీరు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గంగారం వద్ద గోదావరి నదిపై దేవాదుల పంపుహౌస్ ఉన్నది. మూడు దశలుగా ఈ ప్రాజెక్టు ఉన్నది. మొదటి దశలో రెండు మోటర్లు, రెండో దశలో రెండు మోటర్లు, మూడో దశలో ఆరు మోటర్లను ఏర్పాటుచేశారు. 10 మోటర్లతో ఐదు పైపులైన్ల ద్వారా భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారంలోని భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌లోకి నీరు చేరుతుంది. పంపుహౌస్‌లో 78.40 మీటర్ల నీటి నిల్వ ఉండేలా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం 72 మీటర్ల నీటి నిల్వ ఉన్నది. ప్రస్తుతం 5 పంపులతో భీంఘన్‌పూర్ రిజర్వాయర్‌కు నీటి పంపింగ్ జరుగుతున్నది. అక్కడి నుంచి రామప్ప చెరువులోకి బుధవారం నుంచి పంపింగ్ జరుగుతున్నది. రంగరావుపల్లి పంపుహౌస్‌లోని రెండు మోటర్లలో ఒక మోటరు ద్వారా పాకాల సరస్సుకు, అక్కడి నుంచి రంగాయచెరువుకు ఒక మోటరు ద్వారా నీటి సరఫరా జరుగుతున్నది. కాలువ ద్వారా గణపురం చెరువుకు నీటిని తరలిస్తున్నారు. ఈ దశలోని లక్నవరం చెరువుకు ఇదే పంపుహౌస్ నుంచి నీటిని తరలించాల్సి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికోసం చొరవ తీసుకోకపోవడంతో లక్నవరం చెరువుకు నీరు చేరడమే లేదు.
ధర్మసాగర్ రిజర్వాయర్‌కు సరిగా చేరని నీరు
దేవాదుల సాగునీటి వ్యవస్థలో ధర్మసాగర్ రిజర్వాయర్ కీలకమైనది. ఇక్కడి నుంచే అత్యధిక ఆయకట్టుకు నీరు చేరుతుంది. గోదావరి పంపుహౌస్ వద్ద నీరు ఉన్నా నిర్వహణలోపంతో ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నిరంతరంగా పంపింగ్ చేయడంలేదు. దీంతో అక్కడి నుంచి పైన ఉన్న రిజర్వాయర్లకు నీరు చేరడంలేదు. దీని పరిధిలోని చెరువులకు నీరు చేరక పంటలు ఎండిపోతున్నాయి.
ఉత్తర కాలువను మరిచిన సర్కార్
దేవాదుల ప్రాజెక్టు రెండో దశలో భీంఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి మరో పైపు లైన్ ద్వారా హనుమకొండ జిల్లా శాయంపేట మండలం చలివాగుకు, అక్కడి నుంచి ధర్మసాగర్‌కు పంపింగ్ చేసే వ్యవస్థ ఉన్నది. చలివాగులో 22 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నది. చలివాగును కేసీఆర్ ప్రభుత్వం రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసింది. దీని పరిధిలో 3,040 ఎకరాల ఆయకట్టు ఉన్నది. యాసంగిలో 1,800 ఎకరాలు తైబందీ ఇచ్చి నీటిని అందిస్తున్నారు. పంటలకు సాగునీరు అందించే ప్రస్తుత పరిస్థితుల్లో రూ.10 కోట్లతో ప్రభుత్వం చలివాగు కాల్వ లైనింగ్, ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నది.
పదేండ్ల కిందటి కరువును మళ్లీ చూస్తున్నం
పదేండ్ల కిందటి కరువు పరిస్థితుల్ని మళ్లీ చూస్తున్నం. గత ప్రభుత్వం పదేండ్లు చెరువులు, కుంటలు నింపింది. నాకున్న ఎనిమిది ఎకరాలు ఈసారి
సాగు చేసిన. బోర్లు సరిగ్గా పోయడం లేదు. భూగర్భజలాలు అడుగంటి పోతున్నయ్. దీంతో మూడెకరాలు ఎండిపోతున్నది. గతంలో చెరువులు, కుంటలు నింపితే బోర్లు మస్త్‌గా పోసేది. కరెంటు నిండుగా వచ్చేది. ఏ రందీ లేకుండె. కానీ, ఏడాది నుంచి సాగుకు నానా పాట్లు పడుతున్నం. మార్పు అంటే ఏందో అనుకున్నం. ఇంత మార్పు వస్తదనుకోలే.
– ఆత్కూరి కనకయ్య, కొడవటూరు,బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా
నీళ్లు లేక పంటలెండుతున్నయ్
కొతులబాధ, శాతాపురం గ్రామాలకు స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తారు. బోయినిగూడెం వద్ద గేట్లు లేకపోవడంతో నీళ్లకోసం కొట్లాటలు అయితున్నయి. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయ్. బోర్లల్ల నీళ్లు లేక మోటర్లు పోస్తలేవు. వెంటనే బోయినిగూడెం వద్ద గేట్లు ఏర్పాటు చేయాలి.
– జక్కుల రాజు, రైతు ఈరవెన్ను, పాలకుర్తి మండలం