సూర్యాపేట, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో నీళ్ల సమస్యతోనే కన్నీటి వరదలు పారాయి. ఆ నీళ్ల కోసమే స్వరాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. పదేండ్లలో నీటి సమస్యలు తీరి కన్నీళ్లు దూరమయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే నీళ్ల సమస్య తెలంగాణలో కన్నీటి వరద పారిస్తున్నది’ అని అధ్యయన కమిటీ బృందం ఆందోళన వ్యక్తంచేసింది. తెలంగాణ ప్రముఖులైన సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, సీనియర్ సంపాదకీయుడు టంకశాల అశోక్, హైకోర్టు న్యాయవాది ఉపేంద్రతో కూడిన అధ్యయన కమిటీ శనివారం సూ ర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల్లో ఎండిన పంటపొలాలను పరిశీలించింది. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో వారు మాట్లాడారు.
రాష్ట్రం వచ్చాక చెరువులు మత్తళ్లు దుంకడం, పంటలు పండి సస్యశ్యామలం అవడం మన కండ్లతో చూశామని జూలూరి గౌరీశంకర్ గుర్తుచేశారు. ఇదే సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పంట పండిందని, అలాంటి జిల్లా నేడు కన్నీళ్లు పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వంపై రైతులు విమర్శలు చేయడం లేదని, తమను ఎందుకు ఏడిపిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రెండు తడులకు నీళ్లిస్తే పంట బతుకుతుందని చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవడంతో పంటచేలను పశువులతో మేపుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టరేట్‌కు 10 కిలోమీటర్ల దూరంలోనే రైతులు కన్నీళ్లు పెడుతుంటే, ఆ అధికారులకు వారి కన్నీటి గోస వినిపించలేదా? అని ప్రశ్నించారు. రైతులను రోజు కూలీలుగా మార్చడం నేరమేనని చెప్పారు. వెంటనే అధికార యంత్రాంగం పంట నష్టపరిహాం ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.
ఎండిన పంట.. పశువులకు మేత: న్యాయవాది ఉపేంద్ర
ఎండిన పంటపొలాల్లో రైతులు పశువులను మేపుతున్నారని హైకోర్టు న్యాయవాది ఉపేంద్ర ఆవేదన వ్యక్తంచేశారు. రెండు తడులకు నీళ్లిస్తే చాలని రైతులు వేడుకుంటున్న తీరు గుండెను కలిచి వేస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సా ధించుకున్న తర్వాత తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట ప్రాంతాలకు ఎస్సారెస్పీ నీరు అందించడంతో లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యాయని చెప్పారు. నిరుడు సూర్యాపేట జిల్లా అత్యధికంగా వరి పంట పండించిందని తెలిపారు. కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలను తెచ్చారని గుర్తుచేశారు.
రాజకీయాల్లో నిజాయితీ అవసరం : టంకశాల అశోక్
రెండు తడులకు నీళ్లివ్వకుంటే నిజాయితీగా ఇవ్వలేమనే చెప్పాలని, అప్పుడు రైతులు ప్రత్యామ్నాయం ఎంచుకుంటారని సీనియర్ సంపాదకీయుడు టంకశాల అశోక్ తెలిపారు. కాళేశ్వరం చెడిపోవడం వల్ల నీళ్లివ్వలేక పోయామంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు రైతులు పంట వేయడానికి ముందు చెడిపోయింది కదా.. అలాంటప్పుడు రైతులకు ఎలా నీళ్లిస్తామని మాట ఇచ్చారని ప్రశ్నించారు. మొదట కొన్ని తడులకు నీళ్లిచ్చి చివరి తడులకు నీళ్లివ్వలేదని, బోర్లు వేస్తే నీళ్లు పడటం లేదని చెప్పారు. చివరి తడులకు నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు అప్పులపాలయ్యారని, ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ రెండు తడులు ఇచ్చినా అవి అప్పులకే సరిపోతాయని చెప్పారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.