Telangana | ఎల్లారెడ్డిపేట/గంగాధర/మల్లాపూర్, ఫిబ్రవరి 19: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీరదంక పంటపొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అండగంటిపోవడం.. కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో ఆరుగాలం పడిన కష్టం వృథా అవుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారం క్రితం మల్కపేట రిజర్వాయర్ నుంచి ఎల్లారెడ్డిపేట మండలానికి సాగునీరు వదులుతామని అధికారులంతా హడావిడి చేసి, నాలుగైదు రోజులు మాత్రమే నీటిని వదిలారు. దీంతో పరీవాహక ప్రాంత రైతులు రూ.15వేల నుంచి రూ.20వేలు ఖర్చుపెట్టి మోటర్లు తెచ్చి కాల్వలో వేసి పొలాలకు పారించే ప్రయత్నం చేశారు. మూడు రోజులుగా సరిపడా నీళ్లు రాక మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లో నిండుగా నీరు న్నా.. కొండాపూర్ చెరువు జలకళను సంతరించుకున్నా.. మల్లాపూర్, గోపాల్రావుపల్లి, వెంకంపల్లి చెరువుల్లోకి చుక్కనీరు రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట పెద్ద చెరువు నిండుగా ఉండి కాలువల ద్వారా నీళ్లు వచ్చేవి. ప్రస్తుతం ఆ చెరువులో నీటి మట్టం తగ్గిపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. గ్రామ శివారులోని పిల్లిగుట్ట ప్రాం తంలోని తనకున్న రెండెకరాల్లో ఇప్పటి వర కు రూ.40వేల పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే నీళ్లు లేక ఎండిపోతున్నదని జక్కుల రాజమల్లయ్య ఆందోళన వ్యక్తం చేశాడు.
నూతనకల్, ఫిబ్రవరి 19 : ఎస్సారెస్పీ కాల్వకు సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని వేడుకుంటూ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బుధవారం రైతులు ఆందోళన చేశారు. యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు నీళ్లు సరిపోక వాడుతున్నాయని, ఇప్పటికే ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు స్పందించి వెంటనే ఎస్సారెస్పీ కాల్వ ద్వారా సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు.