హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ మునకపై రాష్ట్ర ప్రభుత్వం తీరు ఆది నుంచీ గుడ్డి దర్బార్‌ను తలపిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బుధవారం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులతో పాటు ప్రభుత్వానికి సమర్పించిన కమిటీ నివేదికలోనూ పొరపాట్లు దొర్లినట్టు స్పష్టమవుతున్నది. సంఘటన జరిగిన రోజు అటు ఉన్నతాధికారులకుగాని, ఇటు ప్రభుత్వానికిగాని ఎలాంటి సమాచారం లేదని ప్రభుత్వమే అధికారిక ఉత్తర్వుల్లో అంగీకరించింది. ఏడో తేదీన తమ దృష్టికి వచ్చినట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ‘అసలు ప్రభుత్వానికి ఈ విషయం తెలియకపోతే మాత్రం అది సిగ్గుచేటు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పింది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రెండో తేదీన సంఘటన జరుగగా ఇంజినీర్లు వాస్తవానికి పంపుహౌస్‌లోకి నీళ్లు వచ్చాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కానీ వాళ్లు ఈ అంశంపై లోతుగా వాకబు చేయలేదు. ముఖ్యంగా సీపేజ్ వాటర్ వచ్చిందంటూ ప్రచారం చేయడంతో ఇతర ఇంజినీర్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. మరి సైట్ ఇంజినీర్లుగాని, ఏజెన్సీగాని ఘటనను ఎందుకు తొక్కిపెట్టి, సీపేజ్ వాటర్ అని ప్రచారం చేశారనేది తేలాల్సి ఉన్నది.
‘నమస్తే తెలంగాణ’ ఈ నెల ఏడో తేదీన ఘటనాస్థలికి వెళ్లి పరిశీలన చేసి ఎనిమిదో తేదీన వీడియో, వివరాలను వెలుగులోకి తెచ్చింది. తర్వాత అటు సర్కారు, ఇటు జలమండలిలో హడావుడి మొదలైంది. కాగా ఈ నెల ఏడో తేదీన ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని బుధవారం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు.
సంఘటన వెలుగులోకి వచ్చిన ఈ నెల 8న జలమండలి అధికారికంగా వివరణ ఇచ్చింది. అందులో ఏజెన్సీ ఇన్‌ఫ్లోను సరిగా అంచనా వేయకపోవడమే ఘటనకు ప్రధాన కారణమని పేర్కొన్నది. కానీ జలమండలి పూర్తిస్థాయి బాధ్యులను చేసిన ఏజెన్సీపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. తొలుత బోర్డు అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో దోబూచులాడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.
కమిటీ తన నివేదికలో నాగార్జునసాగర్‌కు ఒక్కసారిగా 4.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో గేటు కొట్టుకుపోయి, గోడ కూలిందని పేర్కొన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. కానీ సంఘటన జరిగిన రెండో తేదీ ఉదయం ఆరు గంటలకు నీటిపారుదల శాఖ అధికారికంగా విడుదల చేసిన ప్రాజెక్టుల లెవల్ షీట్స్‌లో నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 3,36,543 క్యూసెక్కులుగా ఉన్నది. ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటలకు 3,69,866 క్యూసెక్కులుగా ఉన్నది. చివరికి ఘటన వెలుగులోకి వచ్చిన ఎనిమిదో తేదీన కూడా నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 3,19,408 క్యూసెక్కులుగానే ఉన్నది. అంటే నాలుగు లక్షల క్యూసెక్కులు లేదు. అలాంటిది సుమారు ఐదు లక్షల క్యూసెక్కుల వరకు అంటూ ఇన్‌ఫ్లోను పెంచి చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరగడం అనేది కాకుండా వానకాలంలో అందునా సాగర్ నీటిమట్టం పెరుగుతున్న క్రమంలో సొరంగంలో గేటు ఏర్పాటు చేసి, పనులు పూర్తి కాకముందే సొరంగాన్ని ఓపెన్ చేయడమే ఘటనకు ప్రధాన కారణమని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
మరోవైపు సుంకిశాల వంటి కీలకమైన ప్రాజెక్టుల వద్ద క్షేత్రస్థాయిలో ఉండే మేనేజర్లు (ఏఈఈ) ప్రధానం. ముఖ్యంగా సివిల్ ఇంజినీర్లను నియమిస్తేనే ప్రయోజనం ఉంటుంది. కానీ బోర్డు ఉన్నతాధికారులు అక్కడ గత నెల 31వరకు విధుల్లో ఉంచిన మేనేజర్ సవేరాం సివిల్ ఇంజినీర్ కాదని, డిప్లొమా పూర్తి చేసినందున ఆయనను సూపర్వైజర్గానే పరిగణిస్తారని పలువురు ఇంజినీర్లు తెలిపారు. పైగా ఆయన హౌసింగ్‌బోర్డు నుంచి డిప్యూటేషన్‌పై జలమండలికి వచ్చారు. దీంతో పాటు ఆయన బదిలీల్లో భాగంగా వెళ్లిన తర్వాత నియమించిన, ప్రస్తుతం సస్పెన్షన్‌కు గురైన హరీశ్ కూడా సివిల్ ఇంజినీర్ కాదు. ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన ఇంజినీర్. అంటే బోర్డు ఉన్నతాధికారులు పనుల పర్యవేక్షణలో ఆదినుంచీ నిర్లక్ష్యంగా ఉన్నారనేందుకు ఇది మరో ఉదాహరణ అని పలువురు పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలుత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపాన్ని నెట్టేందుకు ప్రయత్నించారు. నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందని దబాయించారు. ఈ ప్రయత్నం విఫలం కావడంతో మరుసటి రోజు మంత్రుల బృందం ‘ఇది చిన్న ఘటన’ అని చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కాగా నాసిరకం నిర్మాణమే కారణమైతే పర్యవేక్షణ లోపం కారణంగా ఇంజినీర్లపై చర్యలెందుకు తీసుకున్నారని, ప్రభుత్వ తాజా చర్యలు భట్టి మాటలు వట్టివేనని చెప్పకనే చెప్పాయని పలువురు రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు.
నల్గొండ జిల్లాలోని సుంకిశాల వద్ద నాగార్జునసాగర్ ఫోర్‌షోర్ నుంచి శాశ్వత ప్రాతిపదికన హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా కోసం చేపట్టిన ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ నిలువునా కుప్పకూలిన ఘటనపై వారం పాటు గోప్యత పాటించడం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఘటన ఈ నెల రెండో తేదీన జరిగితే ‘నమస్తే తెలంగాణ’ ఎనిమిదో తేదీ ఎడిషన్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. దీంతో ఘటన వివరాలు, వీడియో ఒక్కసారిగా సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. జలమండలిలోని ముగ్గురు ఇంజినీర్లతో వేసిన త్రిసభ్య కమిటీ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన రోజే పురపాలక శాఖ అందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలకు ఉపక్రమించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు జలమండలిలోని నలుగురు ఇంజినీర్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకున్నట్టుగా స్పష్టం చేసింది. పాజెక్టు డివిజన్ సర్కిల్-3 (సుంకిశాల)లో పనిచేస్తున్న సీజీఎం ఎస్. కిరణ్‌కుమార్, జీఎం బీ మరియరాజ్, డీజీఎం ఎన్ ప్రశాంత్, మేనేజర్ కేవీపీ హరీశ్‌ను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌ను ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేశారు. టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్‌కు ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఘటన వెలుగులోకి వచ్చాక సంబంధిత ఇంజినీర్లను ఎండీ ఆశోక్‌రెడ్డి వివరణ కోరగా వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోవడం, ఇంజినీర్ల సాంకేతిక పర్యవేక్షణ లోపాన్ని కమిటీ ఎత్తిచూపినందున ఈ చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జలమండలిలో ఏకకాలంలో నలుగురు ఇంజినీర్లపై ఒకేసారి వేటు పడటం బోర్డులో భారీ కుదుపునకు దారితీసింది.