Young India School | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ఫీజులపై తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ స్కూళ్లు వివిధ రకాల ఫీజుల పేరుతో భారీగా వసూళ్లు చేస్తుండగా, ఆ విధానాన్ని ఆమోదించినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే రేకుల షెడ్డు స్కూళ్లలోనే లక్షల్లో ఫీజులుంటే.. పక్కా భవనాలున్న ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ యాజమాన్యాలు అంతకుమించి ఫీజులు వసూలు చేయరని గ్యారెంటీ ఏంటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. సర్కారు అనాలోచిత నిర్ణయం విద్యారంగంలో అనేక దుష్పరిణామాలకు దారి తీస్తుందని ఆందోళన చెందుతున్నారు.
యంగ్ ఇండియా స్కూల్లో సామాన్యుల పిల్లలు చదివే పరిస్థితి లేదని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేట్ సూల్ ఫీజులను నియంత్రిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ సూళ్లను మించిన ఫీజులు వసూలు చేస్తుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకటో తరగతి ఫీజు 2 లక్షల వరకు ఉండటం సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు.