చింతకాని, సెప్టెంబర్ 10: సర్కారు తప్పిదం.. ఇద్దరు అన్నదాతలకు శాపంగా మారింది. ఫలితంగా రైతు రుణమాఫీ వారికి అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక సాఫ్ట్వేర్ తికమలకలతో ఇలా ఎందరో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. నక్కనబోయిన వలరాజుది ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు. గురజాల రామారావుది లచ్చగూడెం. చింతకాని మండలంలోని బస్వాపురం యూనియన్ బ్యాంక్లో వలరాజుకు రుణఖాతా నంబర్ 1353లో రూ.67,878 పంట రుణం ఉన్నది. గురజాల రామారావుకూ అదే యూనియన్ బ్యాంక్లో రుణఖాతా నంబర్ 1335లో రూ.1,67,237 పంట రుణం ఉన్నది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇద్దరూ రుణమాఫీకి అర్హులే. కానీ మూడు విడతలు ముగిసి కాలం గడిచిపోతున్నా ఇద్దరికీ రుణమాఫీ కాలేదు. దీంతో బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన ఇద్దరూ వ్యవసాయ అధికారులను సంప్రదించారు. అక్కడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొదుమూరు రైతు వలరాజు రేషన్ కార్డులో రామారావు పేరు కూడా ఉన్నదని, ఇద్దరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఉన్నట్టు డేటా చూపిస్తున్నదని, ఇద్దరి రుణమా కలిపి 2 లక్షలు దాటినందున రుణమాఫీ జరగలేదని ఆఅధికారి చెప్పారు. దీంతో ఇద్దరూ కం గుతిన్నారు. తమవి వేర్వేరు గ్రామాలని, తాము వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవాళ్లమని సదరు అధికారికి వివరించారు. సాంకేతికలోపం వల్ల ఇలా జరిగిందని ఆయన వారికి సమాధానం ఇచ్చారు.
రుణమాఫీ జాబితాలో నా పేరు లేకపోవడంతో ఏఈవో ను కలిశాను. ఆయన చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయా. నాకుటుంబ రేషన్ కార్డులో నా పేరేలేదు. వేరే కార్డులో ఎలాఉందో అర్థం కావడం లేదు.
-గురజాల రామారావు, రైతు, లచ్చగూడెం
ఏఈవో అడిగిన పత్రాలన్నీ 20 రోజుల క్రితమే ఇచ్చాను. అయినా ఇంత వరకూ నాకు రుణమాఫీ కాలేదు. సరిదిద్ది రుణమాఫీని వర్తింపజేయాలి.
-నక్కనబోయిన వలరాజు, రైతు, కోదుమూరు