రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్నా ప్రభుత్వ పనితీరు పట్ల ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. ప్రభుత్వం పట్టాలు ఎక్కలేదని, పాలన గాడిలో పడలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
ఒకవైపు నిరుద్యోగులు, మరోవైపు రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వేళాపాలా లేని విద్యుత్తు కోతలు.. తాగు నీటి సమస్యలు.. అదుపు తప్పిన శాంతిభద్రతలు.. మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు, భూ, ఆస్తి తగాదాలు, హత్యలు, కిడ్నాపులు కలవరపెడుతున్నాయి.
ఈ రకమైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ లేదని సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వం పట్ల ప్రజల్లో చెడ్డ పేరు వచ్చిందని, అప్పుడే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని వాపోతున్నారు.
ఈ పరిస్థితికి సీఎం రేవంత్‌రెడ్డి అనుభవరాహిత్యం, మొండివైఖరి, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోని అహంభావ వైఖరి కారణమని అసలు కాంగ్రెస్ (ఏసీ) నేతలు వాపోతున్నారు. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడితే, ఎన్నికల హామీలను గాలికి వదిలేసి, సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించి, కక్షసాధింపు చర్యలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి కనబరస్తున్న శ్రద్ధ పాలనపై కేంద్రీకరించడం లేదని అసలు కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగా ణ): ‘ఊరంతా ఒకదారి… ఉలిపిరికట్టదో దారి’ అన్న చందంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని అసలు కాంగ్రెస్ (ఏసీ) నాయకులు వాపోతున్నారు. రాష్ట్రంలో పదేండ్ల తర్వా త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రజ లు ఇస్తే, వారి నమ్మకాన్ని వమ్ము చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా రేవంత్‌రెడ్డి మొండిగా వ్య వహరిస్తున్నారని సహచర మంత్రులు, సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి వైఖరిని మంత్రులు, సీనియర్లు అంతర్గత సంభాషణల్లో తప్పుపడుతున్నారు. రేవంత్‌రెడ్డి మొం డివైఖరి, ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చర్చించుకుంటున్నారు. స్వల్ప వ్యవధిలో వ్యతిరేకత రావడానికి కార ణంపై పార్టీలో అంతర్మథనం జరుగుతున్నది. కారణాలపై అధిష్ఠానం ఆరా తీస్తున్నది.
నిరుద్యోగుల ఆందోళన అంశంలోనూ…
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన నిరుద్యోగులే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే పరిస్థితి వచ్చింది. అన్ని పరీక్షలు ఒకసారి నిర్వహించడం వల్ల అవకాశాలు కోల్పొవాల్సి వస్తుందని, కొన్ని అయినా వాయిదా వేయాలంటూ నిరుద్యోగ యువత రోడ్డెక్కుతున్నా.. సీఎం రేవంత్‌రెడ్డి మొండిగా వ్యవహరించడం వల్ల వీరిని దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని సొంత పార్టీ నేత లే మండిపడుతున్నారు.
ఆందోళనకారులతో సమావేశమై వారి డిమాండ్లు విని, ప్రభుత్వ విధానాన్ని వివరించి సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి మా త్రం భేషజానికి వెళ్లి వారి ఆందోళనను అణచివేసే ధోరణి అవలంబిస్తున్నారని పార్టీ వర్గాలు తప్పుపడుతున్నాయి. సున్నితంగా హ్యాండిల్ చేయడానికి బదులు ఆందోళనకారులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత జటిలం చేశాయని అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యేల చేరికల్లో ఏకపక్ష ధోరణి
ప్రభుత్వ అధినేతగా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకుతోడు పీసీసీ అధ్యక్షుడిగా అవలంబిస్తున్న విధానాలు పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకతకు దారి తీసిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీనియర్ నాయకుడు టీ జీవన్‌రెడ్డికి మాట మాత్రం చెప్పకుండా తన రాజకీయ ప్రత్యర్థి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి విషయం తెలిసిందే. ఎమ్మె ల్సీ పదవికి రాజీనామా చేయడానికి జీవన్‌రెడ్డి సిద్ధపడగా అధిష్ఠానం ఆయనను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించింది.
ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకొని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌తోపాటు వీ హనుమంతరావు, నిరంజన్ వం టి సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిరంజన్ ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. కడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకోవద్దని ఉమ్మ డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ముక్తకంఠం తో వ్యతిరేకించారు.
స్టేషన్‌ఘనపూర్‌లో కడియం శ్రీహరిపై పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థి ఇందిర ధర్నా చేసినా ఖాతరు చేయకపోగా, శ్రీ హరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి రేవంత్‌రెడ్డి పంతం నెగ్గించుకున్నారని గు ర్తు చేస్తున్నారు. గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితతోపాటు పార్టీ శ్రేణులు గాంధీభవన్ ఎదుట ఆందోళన చేసినా పట్టించుకోకుండా అదే నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణ్ణమోహన్రెడ్డిని, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరికను ఆ నియోజకవర్గ శ్రేణులు వ్యతిరేకించినా పార్టీ కండువా కప్పడంతో పాత తరం నేతలను దూరం చేసుకున్నట్టయిందని అంటున్నారు.
నామినేటెడ్ పోస్టులపైనా వివాదం
నామినేటెడ్ పదవుల విషయంలో తమతో చర్చించకుండా, తమ సొంత జిల్లా, నియోజకవర్గాలకు చెందిన తమ వ్యతిరేకులకు పదవులు ఇవ్వడం ఏమిటని మంత్రులు బాహాటంగానే తప్పుపడుతున్నారు. కరీంనగర్ ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా కే నరేందర్‌రెడ్డి నియామకాన్ని ఆ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లాకు చెందిన మంత్రికి సమాచారం లేకుండా నామినేటెడ్ పదవులు కట్టబెడితే తమకు విలువేమి ఉంటుందని పొన్నం మండిపడిన విషయం తెలిసిందే.
మీ ప్రమేయం లేకుండానే తనకు పదవి వచ్చిందని నరేందర్‌రెడ్డి పరోక్షంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు తెలియజేయడానికి వస్తే, అతను ఇచ్చిన బొకేను విసిరేసి మంత్రి తన ఆగ్రహాన్ని వ్యక్తంచేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. వరంగల్‌లో ఇనుగాల వెంకట్రామిరెడిని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ చైర్మన్‌గా నియమించడాన్ని మంత్రి కొండా సురేఖ బాహాటంగా వ్యతిరేకించారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మంత్రివర్గ విస్తరణలోనూ వివక్ష
మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలకు మంత్రివర్గ విస్తరణలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలనేది అధిష్ఠానం ఆలోచన. కానీ, ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకు, సామాజిక వర్గాలకే మంత్రి పదవులు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నాలకు అధిష్ఠానం తాజాగా బ్రేక్ వేసింది. ప్రస్తుత క్యాబినెట్లో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం లభించలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రివర్గంలో చోటు దక్కింది.
ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నలుగురికి స్థానం కల్పించినప్పటికీ , మరో ఇద్దరికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (నల్లగొండ), సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్) పేర్లను సీఎం రేవంత్‌రెడ్డి సిఫారసు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డిని ఎవరూ వ్యతిరేకించలేదు, కానీ ఇప్పటికే నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొనసాగుతుండగా, ఒకే కుటుంబం నుంచి రెండో మంత్రి పదవిని రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి ప్రతిపాదనను అధిష్ఠానం కూడా తప్పుపట్టినట్టు సమాచారం.
ఆదిలాబాద్ నుంచి దివంగత వెంకటస్వామి కుటుంబం నుంచి ఇద్దరు కుమారులు వివేక్, వినోద్ ఎమ్మెల్యేలుగా, మనవడు వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉండగా, ఇదే కుటుంబం నుంచి వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్‌రెడ్డి సిఫారసు చేశారన్న సమాచారంతో పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచీ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు కాకుండా వెంకటస్వామి కుటుంబానికే అన్ని పదవులు కట్టబెట్టాలన్న సీఎం నిర్ణయాన్ని పార్టీ ముఖ్య నేతలు కూడా అధిష్ఠానం వద్ద తప్పుపట్టినట్టు సమాచారం. ఒకవైపు పార్టీ పట్ల, మరోవైపు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్నదని ఇక్కడ రాష్ట్ర నేతలు, అక్కడ అధిష్ఠానం పెద్దలు ఆందోళన చెందుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.