హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఫుట్‌బాల్ సరదాతో ప్రజాధనం వృథా చేసిన తీరు, దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ (Lionel Messi) టూర్లో రేవంత్‌రెడ్డి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. మెస్సీ హైదరాబాద్ పర్యటనలో రేవంత్ ఓవరాక్షన్ చేశారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. సీఎం వ్యవహారశైలి.. వ్యంగ్యాస్ర్తాలకు కేంద్ర బిందువుగా మారింది. రూ.100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం, నామమాత్రపు గేమ్‌షో కోసం ఆర్భాటం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి హావభావాల తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు. సీఎం ప్రాక్టీస్ కోసమే మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రూ.5 కోట్లతో గ్రౌండ్ నిర్మించుకున్నారని, మ్యాచ్ కోసం సింగరేణికి చెందిన రూ.10 కోట్లను కేటాయించారని గుర్తుచేస్తున్నారు. మొత్తం మెస్సీ టూర్, మ్యాచ్, ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.100 వెచ్చించారని ప్రస్తావిస్తున్నారు. ఇంతచేస్తే ఉప్పల్ స్డేడియంలో ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం, దేశంలోని ఫుట్‌బాల్ క్రీడాకారులను అవమానించారని క్రీడారంగ విశ్లేషకులు, శిక్షకులు మండిపడుతున్నారు. మెస్సీ వంటి దిగ్గజ ఆటగాడికి బాల్ పాస్ ఇవ్వడానికి ముచ్చటపడిన రేవంత్ అడ్డదిడ్డంగా ఆడటం దారుణమని, ఆ పని ఎవరైనా నేషనల్ టీమ్ సభ్యుడి స్థాయి ఆటగాడికి ఇవ్వాల్సిందని, రాష్ట్రంలోని మరో క్రీడాకారుడికి ఇవ్వాల్సిందని చెప్తున్నారు. తానేదో పెద్ద ఆటగాడిగా పోజు కోసం.. మేటి క్రీడాకారులను అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మెస్సీ టూర్ అంటే యావత్తు క్రీడా ప్రపంచం దృష్టి పెడుతుందని, అలాంటి చోట హోదాను అగౌరవపర్చేలా ప్రవర్తించారని ఎద్దేవా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. వాటిల్లో ఏముందంటే… ఒక దాంట్లో మెస్సీకి రేవంత్ బాల్ పాస్ చేయలేకపోయారు. దీనిపై బ్రెజిలియన్ ఫుట్‌బాల్ కంటెంట్ క్రియేటర్ స్పెషల్ వీడియో చేశారు. మెస్సీకి బాల్ పాస్ ఇచ్చే అవకాశం రావడమే అరుదు అని, అలాంటిది ఆ నంబర్ నైన్ జెర్సీ బాయ్ ఎవరో కానీ మూడుసార్లు మిస్ చేసుకున్నారని వ్యా ఖ్యానించారు. రేవంత్‌రెడ్డిని భారతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా భావించిన సదరు కం టెంట్ క్రియేటర్ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. రేవంత్‌రెడ్డికి ఆట తెలియకపోతే ఊరుకోవాలి గానీ.. అంతర్జాతీయ సమాజం ముందు భారత క్రీడాకారుల పరువు తీయ డం ఏంటని ఫుట్‌బాల్ సీనియర్ ఆటగాళ్లు ప్రశ్నిస్తున్నారు. మరో వీడియోలో మెస్సీ పుట్‌బాల్‌కు కిక్ ఇస్తే అది గ్యాలరీలో పడింది. ఇంతలో తాను కూడా అలాగే చేయాలని అనుకున్న రేవంత్ ఎందుకులే అని ఆగిపోయారు. తర్వాత ఏమనుకున్నారో ఏమో మరోసారి ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డి శాయశక్తులా కష్టపడి, శక్తినంతా కూడదీసుకుని కిక్ ఇస్తే అది కాస్తా నాలుగైదు మీటర్ల దూరం వెళ్లి ఆగిపోయింది. ఇది ఒక్కటి కాదు.. రేవంత్‌రెడ్డి హావభావాలు, వింత ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా… ఇప్పుడు ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఎవరినో చూసి ఎవరో వాత పెట్టుకున్నట్టు మెస్సీ రేంజ్లో కిక్ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నించడం అవసరమా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఫుట్‌బాల్ గురించి తెలిసిన పిల్లలు, పెద్దలకు మెస్సీ అంటే చాలా క్రేజ్. మెస్సీ ఎదురు గా కనిపిస్తే ఫొటో దిగాలని అనుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వాలని అనుకోవడం సాధారణం. ఉప్పల్ స్టేడియంలో ఓ వ్యక్తి మెస్సీకి చేయి ఇస్తే మెస్సీ కూడా ఆత్మీయంగా చేయి అందించాడు. దీంతో సీఎంకి విపరీతంగా కోపం వచ్చింది. ఏయ్.. ఏం చేస్తున్నావ్ అంటూ గుడ్లురుమి చూస్తూ ఆ వ్యక్తిని తరిమేశారు. మెస్సీ ఎంతో హూందాగా షేక్ హ్యాండ్ ఇస్తే మధ్యలో రేవంత్‌కి కోపం ఎందుకు వచ్చిందంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. అలాగే మెస్సీ ఆత్మీయంగా ఓ పదేండ్ల అబ్బాయికి సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపించగా ఇంతలో మన సీఎం ఎంటరయ్యారు. ఏయ్ పో.. అంటూ పిల్లాడని కూడా చూడకుండా కసురుకున్నా రు. పాపం ఆ పిల్లవాడు నిరాశతో వెనుదిరిగాడు. సీఎం ప్రవర్తన పట్ల మెస్సీ కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి మెస్సీకి రేవంత్‌రెడ్డి బాడీగార్డ్‌లా, పర్సనల్ అసిస్టెంట్‌లా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేడియం మొత్తం 3వేల మంది పోలీసు బలగాలతో నిండి ఉంది. సెక్యూరిటీ చెకింగ్స్ జరిగాయి. కేవలం ఎంపిక చేసిన వాళ్లు మాత్రమే మెస్సీకి అటు ఇటుగా గ్రౌండ్‌లోనికి వచ్చారు. ఆఖరికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కూడా మెస్సీ పక్కకు వెళ్లే అవకాశం రాలేదు. కానీ మెస్సీ సమీపంలోకి ఎవరు వచ్చినా… రేవంత్‌రెడ్డి కసురుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని చెప్తూ ఆ దృశ్యాలను సోషల్‌మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎంలాగా కాకుండా మెస్సీకి పర్సనల్ అసిస్టెంట్‌గా పక్కపక్కనే ఎందుకు తిరిగారని, ఎవరినీ దగ్గరికి రానీయకుండా ఎందుకు అడ్డుకున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే.. కోల్‌కతాలోని స్డేడియంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డి భద్రతపరంగా జాగ్రత్తలు పాటించారని కొందరు కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటున్నారు. స్టేడియంలోమోహరించిన భద్రతా బలగాలు ఉండగా సీఎం బాడీగార్డులా డ్యూటీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
మెస్సీ టూర్, రేవంత్‌రెడ్డి హడావుడి ఎందుకు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. క్రీడల అభివృద్ధి గానీ, ప్రమోషన్ గామీ ఏమీ కనిపించలేదు. మెస్సీ టూర్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని హైదరాబాద్‌కు రప్పించడం, ఆయన సమక్షంలో రేవంత్‌రెడ్డి ఏదో హడావుడిగా షో చేయడం తప్ప… పెద్దగా ఒరిగిందేమీ లేదని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరీ ఘోరం ఏంటంటే.. ఆర్టీసీ బస్సులపై లెజెండ్ వర్సెస్ లెజెండ్ అని ప్రభుత్వం పోస్టర్లు అంటించింది. రేవంత్‌రెడ్డి… తనను తాను మెస్సీతో పోల్చుకోవడం విడ్డూరమని రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మెస్సీ వంటి క్రీడాకారుడు రాష్ర్టానికి వచ్చినప్పుడు.. ఒక సీఎం ఎలా వ్యవహరించాలి.. హూందాగా ఆహ్వానం పలికి, రాష్ట్రంలోని ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారులను పరిచయం చేయాలని, క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వారికి వివరించాలని చెప్తున్నారు. అనుభవజ్ఞులైన క్రీడాకారుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకోవాలని, పాలసీల రూపకల్పనలో ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాలను తెలుసుకోవాలని వివరిస్తున్నారు.
సోషల్‌మీడియా వేదికగా మరో అంశం కూడా విస్తృతంగా చర్చ జరుగుతున్నది. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చిన్నారిగా ఉన్న కేసీఆర్ మనుమడు హిమాన్షు పలు వేడుకలలో పాల్గొనేవాడు. కేసీఆర్ మనుమడిని ఎంతో ఆత్మీయంగా ముద్దు చేస్తూ వెంట తీసుకెళ్లేవారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి… కేసీఆర్ మనుమడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధంలేని పిల్లాడిని పట్టుకుని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారని గుర్తుచేస్తున్నారు. పిల్లాడిపై దుర్మార్గంగా మాట్లాడిన కుసంస్కారం రేవంత్‌కే చెల్లిందని నిప్పులు చెరుగుతున్నారు. హిమాన్షును ఉద్దేశించి కాకి పిల్ల కాకికి ముద్దు అని చిల్లర వ్యాఖ్యలు చేసిన రేవంత్ ఇప్పు డు మనుమడిని ఎందుకు వెంటబెట్టుకుని తిరుగుతున్నారో చెప్పాలంటున్నారు. రేవంత్ వ్యాఖ్యల వీడియో క్లిప్ షేర్ చేస్తూ ఇప్పుడు ఎవరి పిల్ల ఎవరికి ముద్దు మీరే చెప్పండి, మేం అనాలంటే అనలేమా? మాకు పెద్దాయన కుసంస్కారం నేర్పించలేదంటున్నారు.