హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సమాచారం లోపం.. అవగాహన లేమి..పచ్చి అబద్ధాలు.. ఇవి చాలవన్నట్టుగా ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు డిప్యూటీ సీఎం భట్టి తీరు. కేసీఆర్పై నిందలు మోపడమే ఎజెండాగా పెట్టుకున్న ఆయన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆయిల్ సింక్రనైజేషన్ను ఇందుకు వాడుకున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రణాళిక, నిర్మాణం, నిధుల సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇసుమంతైనా భాగస్వామ్యం లేదు. ఇప్పుడదే ప్రాజెక్ట్ను 2025 మార్చి నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని చెప్తున్నారు.
70 శాతానికిపైగా నిర్మాణం పూర్తయిన తర్వాత అంతా తామే చేసినట్టు హడావుడి చేస్తున్నారు. తాజాగా బుధవారం వైటీపీఎస్ ఆయిల్ సింక్రనైజేషన్ను ప్రారంభించి కేసీఆర్ను అభినందించాల్సిన నోటితో భట్టి అబద్ధాలు వళ్లించారు. భట్టి మాట్లాడినవి.. వాస్తవాలు ఏమిటో చూద్దాం.
‘2015 ఫిబ్రవరి 8న పవర్ప్లాంట్ పనులకు పునాది పడింది. అక్టోబర్ 17న పనులు మొదలుపెట్టారు. 2020 అక్టోబర్లో రెండు యూనిట్లు, 2021లో మిగిలిన యూనిట్లు పూర్తిచేయాలని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రాజెక్ట్ సకాలంలో పూర్తిచేయడంలో నాటి ప్రభుత్వం సమీక్షించకపోవడంతో ఆర్థిక భారం పెరిగింది’ అని భట్టి పేర్కొన్నారు.
వాస్తవాలు..
అడ్డుకునే కుతంత్రం
ప్లాంట్ను అడ్డుకునే కుతంత్రాలకు కొదువేలేదు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ ప్రాజెక్ట్ను చేపట్టినా ముంబైకి చెందిన ఒక సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కేసు వేయడంతో 60 శాతం నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ అధ్యయనం చేయాలంటూ ఎన్జీటీ తీర్పునిచ్చింది. గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ (ఆర్ఈసీ) పవర్ పైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) పూర్తిస్థాయి రుణానిచ్చేందుకు ముందుకొచ్చాయి. పలు సాంకేతిక కారణాలతో నిధుల విడుదల ఆపేశాయి. ఇది ప్లాంట్ నిర్మాణంపై ప్రభావం చూపింది.