హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ రెండేండ్ల పాలనలో సాగునీటిరంగం అధ్వానంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టకపోగా, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణనూ గాలికి వదిలేసిందని నిపుణులు మండిపడుతున్నారు. పలు రిజర్వాయర్లలో లీకేజీలు ఏర్పడుతున్నా, ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నా నివారణ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపించినా, నిధులు మంజూరు చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఇంజినీర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులివ్వకుంటే పనులు సాగేదెలా అని ప్రశ్నిస్తున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ నియోజకవర్గంలో సాగు, తాగునీరు అందించేందుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా గుర్రందొడ్డిలో 2011లో 2.30 టీఎంసీల సామర్థ్యంతో రేలంపాడు రిజర్వాయర్ నిర్మించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4 టీఎంసీలకు పెంచింది. 2019 వరకు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేసి వినియోగించేలా అభివృద్ధి చేసింది. రిజర్వాయర్ నుంచి లీకేజీని అరికట్టేందుకు డ్యామ్సేఫ్టీ అధికారుల సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు జియోఫిజికల్, టెటెక్నిల్ పరీక్షలు నిర్వహించారు. మరమ్మతులకు రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మరోసారి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) అధ్యయనం చేయించాలని అనుకున్నారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ బృందం రిజర్వాయర్ను సందర్శించింది. పరీక్షలకు 3.5 కోట్లు అవసరమని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
ఆర్డీఎస్పై సమగ్ర అధ్యయనం చేయించాలని కేఆర్ఎంబీలో 16వ సమావేశం నిర్ణయించింది. ఆ బాధ్యతను తీసుకోవాలని సీడబ్ల్యూపీఆర్ఎస్ను కేఆర్ఎంబీ సంప్రదించింది. అనికట్ ఆధునికీకరణపై సూచనలివ్వడంతోపాటు ఇతరత్రా అంశాలపై అధ్యయనం చేయాలని సీడబ్ల్యూపీఆర్ఎస్కు మార్గదర్శకాలు ఇచ్చింది. సీడబ్ల్యూపీఆర్ఎస్ సుముఖతతో అధ్యయనానికి రూ.24 లక్షల వ్యయమవుతుందని కేఆర్ఎంబీకి నివేదించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి, నివేదికను అందించింది. ఈ పనులపైనా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని సాగునీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 10 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించారు. ఆనకట్ట కుడివైపు కట్ట 700 మీటర్ల నుంచి 950 మీటర్ల మధ్య దెబ్బతిన్నది. రివిట్మెంట్లోనూ సమస్య తలెత్తింది. ప్రాజెక్టులో 4 నుంచి 5 టీఎంసీల మించి నీటిని నిల్వ చేయలేని దుస్థితి నెలకొన్నది. సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం చేయించాలని అధికారులు భావించారు. రూ.4.5 కోట్లపైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినా నిధులు ఇవ్వకపోవడంతో మరమ్మతులు నిలిచిపోయాయి.
సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోనూ సమస్యలు నెలకొన్నాయి. మరమ్మతులు చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరించింది. రాజీవ్భీమా పథకంలో నిర్మించిన భూత్పూర్ రిజర్వాయర్, సంగంబండ ప్రాజెక్టుల్లోనూ లీకేజీ సమస్యలు నెలకొన్నాయి. హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చే ఏఎమ్మార్పీలో కీలకమైన పుట్టంగండి డెలివరి సిస్టర్న్ నుంచి లీకేజీలు గుర్తించారు. దేవాదుల టన్నెల్లోనూ లీకేజీ సమస్యలు వెలుగుచూశాయి. కానీ ప్రభుత్వం నిధులు ఇవ్వడంలేదని ఇంజినీర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.