Caste Census | హైదరాబాద్, మార్చి16 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024) గణాంకాలను విశ్లేషించడానికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీలో ఫ్రెంచ్ ఆర్థికవేత్తకు చోటుకల్పించడంపై దుమారం రేగుతున్నది. బీసీ మేధావులు, కుల సంఘాల ప్రతినిధులు, పలు రాజకీయపక్షాల నుంచి విమర్శలొస్తున్నాయి. దేశంలో నిపుణులే లేరా? గోప్యంగా ఉంచాల్సిన గణాంకాలను విదేశీయుడికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుడు నవంబర్ 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ, ఉపాధి, ఉద్యోగ, కుల స్థితిగతులను అంచనా వేయడానికి ఇంటింటి సర్వే నిర్వహించింది.
సర్వే నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి, ప్రత్యేక సమావేశంలో శాసనసభలో ప్రవేశపెట్టింది. సర్వే డాటాను విశ్లేషించడానికి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో 11 మంది సభ్యుల స్వతంత్ర నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసింది. వైస్‌చైర్మన్‌గా ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ శాంతాసిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, డాక్టర్ సుఖదేవ్ థోరట్, నిఖిల్ డే, ప్రొఫెసర్ భంగ్యా భూక్యా, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, ప్రొఫెసర్ జీన్డ్రేజ్, ప్రవీణ్చక్రవర్తితోపాటు ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టిని వర్కింగ్ గ్రూపు సభ్యులుగా నియమించింది. ఈ వరింగ్ గ్రూప్ సర్వే డాటాను విశ్లేషించి, నెలలోపు నివేదికను సమర్పించాలని సర్కారు నిర్దేశించింది. అయితే వర్కింగ్ గ్రూప్‌లో ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టిని నియమించడంపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతున్నది.
సర్కారు ఆంతర్యమేంటి?
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కులగణన అధ్యయన కమిటీలో థామస్ పికెట్టి నియామకం వెనుక ప్రభుత్వం ఆంతర్యమేంటని బీసీ మేధావులు, కులసంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, కుల నిర్మాణాలపై పరిశోధనలు చేసిన నిపుణులు ఎందరో ఉన్నారని గుర్తుచేస్తున్నారు. వారందరినీ పకనపెట్టి విదేశీ ఆర్థికవేత్తను తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని నిలదీస్తున్నారు. పశ్చిమ దేశాల ఆర్థిక అసమానతలే కేంద్రంగా థామస్ పికెట్ట్టి పరిశోధనలు, అధ్యయనాలు చేశారని, ఆయనకు భారతీయ కుల వ్యవస్థపై పూర్తి అవగాహన లేదని చెప్తున్నారు. ప్రభుత్వ ఎజెండాను అమలు చేసేందుకే ఫ్రెంచ్ ఆర్థికవేత్తను నియమించారా? తెలంగాణ నిపుణులను ప్రభుత్వం పకనపెట్టడానికి కారణమేమిటి? కులగణన తుది నివేదిక పారదర్శకంగా విడుదలవుతుందా? అని బీసీ మేధావులు, కులసంఘాల ప్రతినిధులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. స్థానిక సంస్థల్లో, ఉద్యోగ, విద్యా రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక ప్రకటించదా? అని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం తక్షణం స్పందించాలి
థామస్ పికెట్టి నియామకంపై ప్రభు త్వం తక్షణం స్పందించాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆంతర్యమేంటని నిలదీశారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కులగణన అధ్యయన ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించాలని కోరారు. తెలంగాణ నిపుణులకు కమిటీలో ప్రాధాన్యం కల్పించాలని, నివేదికపై బహిరంగ చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన ఉద్దేశమెంటో చెప్పాలి.
– వకుళాభరణం
విదేశీయుడికి దేశ ప్రజల వివరాలా?
కుల సర్వే డాటా విశ్లేషణ కోసం నియమించిన వర్కింగ్ గ్రూప్‌లో ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టికి చోటు కల్పించడాన్ని బీజేపీ నేత అమిత్ మాలవీయ తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ జార్జ్‌సోరోస్ నీడలో ఉంటూ భారతదేశ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నదని ఎక్స్ వేదికగా ఆరోపించారు. సున్నితమైన జనాభా డాటాను విదేశీయుడికి అప్పగించడం ఏమిటి? దేశంలో అర్హత కలిగిన నిపుణులు లేరా? అని నిలదీశారు.
– బీజేపీ నేత అమిత్ మాలవీయ