NIMZ | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : భారీగా పెట్టుబడులు సాధించినట్టు గొప్పలు చెబుతున్న రాష్ట్ర సర్కారు పరిశ్రమలకు భూముల కేటాయింపు, అనుమతులు మంజూరుపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్టు పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జహీరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)లో పరిశ్రమల ఏర్పాటుకు పలు పరిశ్రమలు ముందుకొస్తున్నా అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా నిరుడు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌కు ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీని మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అందులో పురోగతి లేదు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, న్యాలకల్, జరాసంఘం మండలాల పరిధిలో సుమారు 13,500 ఎకరాల్లో నిమ్జ్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇందులో దాదాపు 8 వేల ఎకరాల పైచిలుకు భూముల సేకరణ కూడా పూర్తయ్యింది. అంతేకాదు, దీనికోసం కేసీఆర్ సర్కారు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు కూడా సాధించింది. ఇందులో సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, 2.44 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. నిమ్జ్ అభివృద్ధిలో భాగంగా అంతర్గత మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.4,500 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా గత ఏడాది కేంద్రం జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీని మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఇక్కడ భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశమున్నది.
అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి పరిశ్రమల రంగంపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. ఫోర్త్‌సిటీకి పెట్టుబడులు మల్లించేందుకు మిగిలిన ప్రాంతాలను సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. నిమ్జ్‌లో అనేక ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీల ఏర్పాటుకు పరిశ్రమలు ముందుకొస్తున్నాయి. ఓ ప్రధాన కార్ల కంపెనీ రెండేండ్ల క్రితమే జహీరాబాద్ ప్రాంతంలో టెస్టింగ్ ట్రాక్ నెలకొల్పేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. అయినప్పటికీ పరిశ్రమకు అవసరమైన భూ కేటాయింపు, అనుమతులను ప్రభుత్వం మంజూరు చేయలేదని సమాచారం. ఇదే తరహాలో పలు ఈవీ కంపెనీలు భూములు కేటాయిస్తే పరిశ్రమలు ఏర్పాటుచేయనున్నట్టు తెలుస్తున్నది. పలు పరిశ్రమలు టీజీఐఐసీని సంప్రదిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలని సూచిస్తున్నట్టు సమాచారం. ఏడాదిన్నరగా ఎన్నో పరిశ్రమలు నిలిచిపోయాయని, ప్రభుత్వం సిఫారసు చేసే కంపెనీలకు మాత్రమే భూకేటాయింపులు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రణాళికలు కాగితాలకే పరిమితం..
మరోవైపు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని మంజూరు చేసింది. రూ.28,602 కోట్లతో దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్‌సిటీలను మంజూరు చేయగా, అందులో జహీరాబాద్‌కు కూడా చోటు లభించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్జ్ కోసం భూసేకరణ చేయడంతోపాటు పర్యావరణ అనుమతులు కూడా సాధించడంతో జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పవచ్చు. కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే సరిపోతుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి కేంద్రీకరించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జహీరాబాద్‌లో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల భూమికి సంబంధించి 3,100 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది.
రాష్ట్రానికి సంబంధించి.. షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్(ఎస్హెచ్ఏ), స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్(ఎస్ఎస్ఏ) ఇదివరకే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్-మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం అందనుంది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీని ఏర్పాటుచేయాలని ప్రణాళికలు రూపొందించారు. రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును విస్తరించాలని నిర్ణయించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్(ఎన్ఐసీడీఐటీ) ఫ్రేమ్ వర్లో భాగంగా.. 3,245 ఎకరాల్లో మొదటి దశ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ స్మార్ట్‌సిటీ పుణె-మచిలీపట్నం జాతీయ రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండడమే కాకుండా నిజాంపేట్-బీదర్ (ఎస్‌హెచ్-16), జహీరాబాద్-బీదర్ (ఎస్‌హెచ్-14)కి సమీపంలో ఉన్నది.అయినప్పటికీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.