హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లే దేశంలో బొగ్గు నిల్వలపై అనుమానాలు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. బొగ్గు సరఫరాకు సంబంధించి లాక్డౌన్ సమయంలోనూ సమస్యలు తలెత్తలేదని చెప్పారు. ఇప్పుడు కేంద్రం రోజుకో రకంగా ఇస్తున్న ఉత్తర్వుల వెనుక కుట్రకోణం ఉన్నదని అనుమానాలు వస్తున్నాయన్నారు. తెలంగాణకు బొగ్గు సరఫరా సమస్యలు లేవు.. రావు అని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కావాల్సినంత బొగ్గును సింగరేణి సరఫరా చేస్తున్నదని తెలిపారు. అంతర్జాతీయంగా బొగ్గు కల్లోలం సృష్టిస్తున్నది. చాలా రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలూ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో బొగ్గు నిల్వలు, సరఫరా, కేంద్ర విధానాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించేందుకేనా?
పరిస్థితులను చూస్తే అందరికీ అనుమానాలొస్తున్నాయి. కరోనా ప్రారంభంలో లాక్డౌన్.. రెండోవేవ్ సమయంలో మరోసారి లాక్డౌన్ పెట్టినప్పుడు కానీ బొగ్గు కొరత, విద్యుత్తు కోతలు తలెత్తలేదు. కానీ గడిచిన వారం పది రోజులుగా ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందని ఆలోచిస్తున్నాం. విమర్శకులు, నిపుణులు చెప్తున్నదాన్ని బట్టి ఆలోచిస్తే.. కేంద్రమే కావాలని ఈ పరిస్థితిని సృష్టించిందా అనే అనుమానాలు వస్తున్నాయి. విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించడంపై మొదట్నుంచి కేంద్రం దూకుడుగానే ఉన్నది. ఇప్పటికే అనేక నిబంధనలు విధిస్తూ.. రోజుకో ఉత్తర్వు జారీ చేస్తున్నది. ఇలాంటి పరిస్థితులు రావడం వెనుక ఏదైనా కుట్రకోణం ఉన్నదా అన్న అనుమానమూ వస్తున్నది.
మనకు ఇబ్బందులు లేవు
అంతర్జాతీయంగా.. దేశీయంగా బొగ్గు కొరత కారణంగా విద్యుదుత్పత్త్తి, సరఫరాలో తలెత్తిన పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ఈ పరిస్థితులు మన వరకు రావు. ఎలాంటి ఇబ్బందులు మనకు లేవు. కారణం.. కావాల్సినంత బొగ్గును సింగరేణి మనకు సరఫరా చేస్తున్నది. ఈ విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు. ఇబ్బందులకు ఆస్కారం లేదు.
బొగ్గు సరఫరాలో మనకే ప్రాధాన్యం
మన థర్మల్ కేంద్రాలన్నీ పిట్‌హెడ్ ప్రాజెక్టులు. అంటే బొగ్గుకు సమీపంలోనే ఉన్నవి. ఎక్కడైతే బొగ్గు అందుబాటులో ఉన్నదో.. అక్కడే థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ఏర్పాటుచేయాలన్నది జాతీయ అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నదే. దీనినే మనం అనుసరించాం. ఇలాంటి థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ప్రాధాన్యం ఉంటుంది. మన జెన్కో ఆధ్వర్యంలోని, ఎన్టీపీసీ ఆధ్వర్యంలోని అన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తున్నది. మన దగ్గరి సింగరేణి మనకు బొగ్గు ఇవ్వకపోవడం అనే ప్రశ్నే తలెత్తదు. అనుమానాలు వద్దు. అయినప్పటికీ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. సీఎం కేసీఆర్‌కు నివేదిస్తున్నాం.
మన అవసరాలు.. 20 శాతంలోపే!
సింగరేణి సంస్థ ప్రతిరోజూ 1.8 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. మన థర్మల్ కేంద్రాలకు రోజూ 28 నుంచి 30 వేల టన్నుల బొగ్గు సరిపోతుంది. ఎవరైనా వారం పది రోజులు.. మహా అయితే 15 రోజులకు సరిపడా బొగ్గును మాత్రమే నిల్వ చేసుకొంటారు. ప్రతిరోజూ వినియోగిస్తారు. అంతేస్థాయిలో బొగ్గు సరఫరా అవుతుంది. మన సింగరేణి మన అవసరాలను తీర్చడంతోపాటు.. ఇతర రాష్ర్టాలకు సైతం బొగ్గును సరఫరా చేస్తున్నది. గడిచిన రెండుమూడు రోజుల నుంచి 1.9 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నది. ఇవన్నీ చూసుకొన్నా మనకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. నిశ్చింతగా ఉండవచ్చు. నిల్వల విషయంలోనూ ఎలాంటి ఢోకా లేదు. మన తెలంగాణకు సింగరేణి శ్రీరామ రక్ష. మరో 200 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. దేశవ్యాప్తంగా భయాందోళనలు తలెత్తుతున్నాయి. ఎలాంటి భయం అవసరం లేదు.
వన్ నేషన్ వన్ గ్రిడ్.. సరైంది కాదు..
ఇది సేవల రంగం. రాష్ర్టానికే వదిలేయాలి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు విద్యుత్తును అందించాలి. సమాజంలోని దిగువస్థాయిలో ఉన్న వర్గాలకు సబ్సిడీలు, రాయితీలు ఇవ్వాలి. ఇవన్నీ కేంద్రం ఇస్తుందా? ఆదిలాబాద్‌లోని మారుమూల గూడెంకు, ఖమ్మంలోని ఎక్కడో ఉండే కోయగూడేనికి, నల్లమలలో ఉండే చెంచుగూడేనికి కేంద్రం కరెంటు ఇస్తుందా? రాష్ట్రమే అందిస్తుంది. అక్కడి పరిస్థితుల ఆధారంగా ఎలా అందించాలనేది రాష్ట్రం చూసుకుంటుంది. పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం కనుకనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ర్టాల్లో కోతలు ఉన్నప్పటికీ.. మన రాష్ట్రంలో ఒక్క క్షణం కోత లేదు. అదీ మన సీఎం ముందుచూపు. దేశంలో ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం కేంద్రం వైఖరే.
జెన్కో ఆధ్వర్యంలోనే థర్మల్ కేంద్రాలు..
ఇలాంటి పరిస్థితులను ముందుగానే ఊహించిన సీఎం కేసీఆర్.. ముందునుంచీ ప్రభుత్వరంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేశారు. కొత్తగూడెం, సింగరేణి, మణుగూరు, యాదాద్రి లాంటివన్నీ జెన్కో ఆధ్వర్యంలోనే ఏర్పాటుచేశాం. ఇటు సింగరేణి మనదే.. థర్మల్ విద్యుత్తు కేంద్రాలుకూడా మనవే. అందులోనూ పిట్‌హెడ్ ప్లాంట్లు కనుక.. బొగ్గు సరఫరాలో మన ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఉంటుంది. మన అవసరాలు తీరిన తర్వాత ఇతరులకు సరఫరాచేయాలి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు తలెత్తవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితుల ప్రభావం మన రాష్ట్రంపై ఇసుమంత లేదు. ఉండదు కూడా. థర్మల్తోపాటు మనకు జల విద్యుత్తు, సౌర విద్యుత్తుకూడా అందుబాటులో ఉన్నది. జల విద్యుత్తుపై పూర్తిగా ఆధారపడలేం. సౌర విద్యుత్తు పగలు మాత్రమే అందుతుంది. థర్మల్ అనేదే ఆధారపడదగింది. దానినే సీఎం కేసీఆర్ పటిష్ఠంచేశారు.
కేంద్రం తెచ్చే చట్టాల వల్లే..
ఇప్పటికిప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేంద్రం తెచ్చే విద్యుత్తు చట్టాల వల్ల మనకు ఇబ్బందులు తలెత్తవచ్చు గానీ.. ఈ పరిస్థితుల వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కేంద్రం జోక్యం చేసుకోకుండా ఉన్నంతకాలం మనకు ఇబ్బందులు రావు. తలెత్తవు. కొత్త చట్టాలను తెచ్చి.. వాటిని బలవంతంగా అమలుచేస్తే.. ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో చెప్పలేం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి తలెత్తిందంటే అది కేంద్రం బాధ్యతే. తప్పకుండా కేంద్రమే పరిష్కరించాలి.
సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే..
ప్రస్తుతం అన్ని రాష్ర్టాలు ఇబ్బందులు పడుతున్నాయి. మన దగ్గర ఇలాంటి పరిస్థితి తలెత్తకపోవడానికి సీఎం కేసీఆర్ ముందుచూపే కారణమైంది. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పకడ్బందీగా ప్రణాళికను అమలుచేస్తున్నాం. ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అనేది దేశానికే ఆదర్శం. రోడ్డు, రైలుమార్గాల కోసం నెట్‌వర్క్‌ను ఎలా ఏర్పాటు చేసుకొంటామో.. విద్యుత్తు నెట్వర్క్నుకూడా ఏర్పాటు చేసుకొన్నాం. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. హైదరాబాద్ చుట్టుపక్కలా విద్యుత్తు వలయాన్ని ఏర్పాటు చేసుకొన్నాం. రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్తు ఉత్పత్తి అయినా.. హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా.. అలాగే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేలా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నాం.
వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్టే..
కట్టంగూర్/కేతేపల్లి, అక్టోబర్ 12: ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి పంట వేస్తే.. ఉరేసుకున్నట్లేనని, అందుకు కారణం కొనుగోళ్ల విషయంలో కేంద్రం చేతులు ఎత్తివేయడమేనని మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదాయంతోపాటు ఆరోగ్యాన్నిచ్చే పంటలు పండించే దిశగా రైతులు ఆలోచన చేయాలని సూచించారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ శివారులోని గంగదేవిగూడెంలో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్‌పీసీఎల్) భవన నిర్మాణానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ డిమాండ్ ఉన్న పంటల వైపు మళ్లడంతోపాటు సేంద్రియ ఎరువులతో సాగు చేయాలని రైతులకు సూచించారు. పంటలు బలహీనంగా ఉన్నప్పుడే రసాయన ఎరువులు ఉపకరిస్తాయని, అంతిమంగా పంటలకు బలాన్నిచ్చేది సేంద్రియ ఎరువులేనని తెలిపారు. అనంతరం కేతేపల్లిలో జరిగిన టీఆర్ఎస్ మండల, గ్రామశాఖ పరిచయ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఎన్నో కుట్రలు, శక్తులను తట్టుకుని గెలిచి, నిలిచిన పార్టీ టీఆర్ఎస్. కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా చేతబట్టి కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో నేడు దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి’ అని తెలిపారు.