రఘునాథపాలెం, ఫిబ్రవరి 18 : వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈజీఎస్, సెర్ప్, గ్రామ పంచాయతీ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో బుధవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెలా గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాలో అనుసరిస్తున్న విధానాలపై సమావేశాలు నిర్వహిస్తూ మినిట్స్ కాపీలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
రఘునాథపాలెం, తిరుమలాయపాలెం మండలాల్లో తక్కువగా ఉపాధి పనులు జరిగాయని, ఉపాధి పనుల కింద మంజూరు చేసిన అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో పూర్తి చేసేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. సోషల్ ఆడిట్‌కు సమాంతరంగా ఉపాధిహామీ పనులు జరిగేలా చూడాలన్నారు. స్వశక్తి మహిళా సంఘాల్లో మహిళలను భాగస్వాములను చేసేందుకు నూతన ఎస్‌హెచ్‌జీలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లపై దృష్టి సారించి ప్రతి గ్రామంలో నిర్దేశిత లక్ష్యం ప్రకారం వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో కొండపల్లి శ్రీరాం, డీపీవో రాంబాబు, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, డీపీవో విజయలక్ష్మి, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.