హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా తప్పుడు సమాచారం లేదా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ‘సర్’ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వబోతున్నారు. నోటీసులు అందుకున్నవారంతా వ్యక్తిగత విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్నికల అధికారులు అడిగిన నిర్దేశిత ధ్రువీకరణ ప్రతాలను చూపించాల్సి ఉంటుంది. వ్యక్తిగత విచారణ సమయంలో ఓటర్లు సమర్పించే పత్రాలను అధికారులు స్వతంత్రంగా పరిశీలిస్తారు. ప్రభుత్వ అధికారికి తప్పుడు సమాచారం ఇవ్వడం బీఎన్ఎస్ సెక్షన్ 217 ప్రకారం తీవ్రమైన నేరం.
ఫోర్జరీ లేదా తప్పుడు సమాచారం ఇస్తే బీఎన్ఎస్, ఇతర చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఓటర్ల జాబితా నమోదు లేదా సవరణలో తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సెక్షన్ 31 ప్రకారం ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. రాష్ట్రంలో 60.50 లక్షల మందికిపైగా ఓటర్ల దరఖాస్తుల్లో పేర్లు, వయస్సు వంటి వివరాలు పాత రికార్డులతో సరిపోలలేదు. మరో 32.36 లక్షల మందికిపైగా ఓటర్లు 2002 నాటి జాబితాతో తమ వివరాలను మ్యాపింగ్ చేసుకోలేకపోయారు. మ్యాపింగ్ లేని ఓటర్లకు నోటీసులు పంపారు. అసలు పత్రాలతో ఓటర్ల నమోదు అధికారి (ఈఆర్వో) ముందు హాజరుకావాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర ఓటర్లకు ఇంగ్లిష్లో నోటీసులు పంపుతున్నట్టు ఎన్నికల కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ముసాయిదా జాబితాలో పేర్లు వచ్చినా ఎన్యుమరేషన్ ఫామ్లో ఇచ్చిన వివరాల్లో తేడాలు ఉన్నవారికి, 2002 నాటి ‘సర్’ జాబితాతో వివరాలు కలువని వారికి ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఏ తేదీన, ఏ సమయంలో, ఎక్కడ, ఏ అధికారిని కలువాలో, ఏఏ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలో ఆ నోటీసుల్లో స్పష్టంగా వెల్లడిస్తున్నారు. విచారణ సమయంలో ప్రదర్శించడానికి ఆమోదయోగ్యమైన కొన్ని ముఖ్యమైన పత్రాల జాబితా ఇలా ఉన్నది. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పీఎస్యూలు జారీ చేసిన ఐడీ కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్. 1987 జూలై 1 కంటే ముందు ప్రభుత్వం, బ్యాంకులు, పోస్టాఫీసు లేదా ఎల్ఐసీ జారీ చేసిన పత్రాలు.
పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం. పాస్పోర్ట్ లేదా గుర్తింపు పొందిన బోర్డుల మెట్రిక్యులేషన్/విద్యార్హత సర్టిఫికెట్లు. శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం లేదా అటవీ హకుల పత్రం. కుల ధ్రువీకరణ పత్రాలు (ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ) లేదా భూమి/ఇంటి కేటాయింపు పత్రాలు. జాతీయ పౌర రిజిస్టర్ లేదా స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్. ఆధార్ కార్డు వినియోగానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రత్యేక మార్గదర్శకాలు వర్తిస్తాయని సీఈవో కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.