BRS | కరీంనగర్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ జడ్పీలో ప్రజల సమస్యలపై ప్రశ్నించిన పాపానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. మంగళవారం జరిగిన కరీంనగర్ జిల్లా పరిషత్తు సమావేశంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఎమ్మెల్యే ఆటంకం కలిగించారని పేర్కొంటూ కరీంనగర్ జడ్పీ సీఈవో శ్రీనివాస్ వన్‌టౌన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు.
దాంతో కౌశిక్‌రెడ్డిపై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 221, 126 (2) ప్రకారం పోలీసులు మంగళవారం అర్ధరాత్రి క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.. సీఈవో ఫిర్యాదును నిరసిస్తూ సదరు అధికారే తమ విధులు, హక్కులకు ఆటంకం కల్పించారంటూ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి బుధవారం జడ్పీ సీఈవోపై కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. జడ్పీలో ఆహ్వానితుడిగా తాను సమావేశానికి హాజరై ప్రజాసమస్యలను ప్రస్తావించే సమయంలో తన విధులను ఆటంకపరిచిన జడ్పీ సీఈవో శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఫిర్యాదుపై సీపీ సానుకూలంగా స్పందించారని కౌశిక్‌రెడ్డి, గంగుల కమలాకర్ మీడియాకు తెలిపారు.
కొత్త ఆచారాన్ని తెరపైకి తెచ్చింది: గంగుల
ప్రజాసమస్యలపై ప్రశ్నించిన పాపానికి కేసు నమోదు చేయటం అనే కొత్త ఆచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాసమస్యలపై అధికారులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. గతంలో ఇదే జడ్పీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు అనేక ప్రజా సమస్యలపై చర్చించారని, అధికారులను నిలదీశారని, మరి వారిపై కేసులు నమోదు చేశారా? అని అడిగారు.
20 ఏండ్లుగా అసెంబ్లీలో ప్రజాసమస్యలపై మాట్లాడుతూ.. అందులో ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నామని, ఎవరిపైనా కేసులు నమోదు చేయని విషయాన్ని గుర్తించాలని అన్నారు. ప్రజా సమస్యలపై నిలదీసినందుకు కేసులు పెట్టే సంస్కృతి కరీంనగర్లో కొత్తగా మొదలైందని, ఇది మంచిది కాదని స్పష్టం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలుగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అధికారం తమకు ఉండదా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తన నియోజకవర్గంలోని సమస్యల గురించి అధికారులను అడిగితే పోలీసులు కేసు నమోదు చేయటం విచారకరమని అన్నారు. జడ్పీ ప్రాంగణంలో ఏది జరిగినా జడ్పీ అధ్యక్షుల అనుమతి తీసుకుని ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని, కానీ, ఇందుకు విరుద్ధంగా జరిగిందని వెల్లడించారు. తమ హక్కులకు కూడా భంగం కలగకుండా అందరినీ సమానంగా చూడాలని సీపీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. తాము సీఈవోపై ఇచ్చిన ఫిర్యాదుపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని సీపీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు.
తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని సీఎం రేవంత్ చెప్పిన మూడు రోజులకే కరీంనగర్లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైందని, ఈ జిల్లాపై సీఎం దృష్టి సారించాలని గంగుల కోరారు. ప్రజా సమస్యలపై ఏ ఎమ్మెల్యే అయినా తన వద్దకు రావచ్చని సీఎం చెప్పారని, అదే ప్రజాసమస్యలపై జడ్పీలో మాట్లాడిన కౌశిక్‌రెడ్డిపై కక్ష సాధింపు ధోరణిలో కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేపై నమోదుచేసిన ఎఫ్ఐఆర్పై విచారణ జరిపి మూసివేయాలని అన్నారు.
ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే కేసులు: కౌశిక్‌రెడ్డి
జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసినందుకు తనపై కేసు నమోదు చేశారని పాడి కౌశిక్‌రెడ్డి వాపోయారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారా? వారికి పుస్తకాలు ఇచ్చారా? దుస్తులు ఇచ్చారా? భోజనాలు పెడుతున్నారా.. లేదా? అనే అంశాలపై ఎంఈవోలతో తన నియోజకవర్గంలో సమీక్ష నిర్వహిస్తే.. ఎమ్మెల్యే మీటింగ్‌కు ఎలా వెళ్తారంటూ మండల విద్యాధికారులకు డీఈవో నోటీసులు ఇవ్వడంతోపాటు వారిని రిటైన్ చేయటం బాధాకరమని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో గంగుల కమలాకర్ జిల్లా మంత్రిగా పాఠశాలలు ప్రారంభమవుతున్న ప్రతిసారి సమీక్ష నిర్వహించేవారని, ఇప్పుడున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు.. జిల్లాలో సమీక్షలు ఎందుకు పెట్టడం లేదు? అని ప్రశ్నించారు. బాధ్యతగల ఎమ్మెల్యేగా తాను సమీక్ష నిర్వహిస్తే మండల విద్యాధికారులపై చర్యలు తీసుకోవటం ఎంత వరకు సముచితం? అని నిలదీశారు.
మంగళశారం జరిగిన జడ్పీ సమావేశంలో తాను ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో కలెక్టర్, డీఈవో జడ్పీ హాలు నుంచి వెళ్లిపోయారని తెలిపారు. హుజూరాబాద్‌లో దళితబంధు ఎందుకు ఇస్తలేరని, కేసీఆర్ కిట్స్ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించానని, ఇలా ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు విని ఆగం కావొద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు నమ్మిన జమ్మికుంట తహసీల్దార్ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో కుమ్రంభీం ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ప్రొటోకాల్ వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఎలాంటి ప్రొటోకాల్ లేకపోయినా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యేగా తనను పిలవటం లేదని మంత్రి సీతక్క, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావుపై కోవ లక్ష్మి సోమవారం ఆరోపణలు చేశారు. ఆరోపణలను ఖండిస్తూ ఆమె దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేసి, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుపై కోవ లక్ష్మి స్పందిస్తూ అధికార అహంకారంతో కాంగ్రెస్ నాయకులు పెటే ్టకేసులకు భయపడేదే లేదని తెలిపారు.