వేములవాడ, అక్టోబర్ 15: వేములవాడ రాజన్న ఆలయంలో తలనీలాల సేకరణ కాం ట్రాక్టర్‌పై న్యాయ స్థానంలో క్రిమినల్ కేసు న మోదైంది. 2023-25 రెండేండ్లకుగాను తలనీలాల సేకరణకు ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురానికి చెందిన సుమిత్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు నాగరాజు రూ.19 కోట్లకు టెండర్ దక్కించుకున్నాడు. తొలుత రూ.50 లక్షలు డిపాజిట్ చేసి, ప్రతి నెలా రూ.79,17,000 చెల్లించేందుకు 24 చెకులను ఆలయ అధికారులకు అందజేశాడు.
ఏప్రిల్ 2024 వరకు రూ.8,92,04,500 చెక్కుల ద్వారా చెల్లించాడు. ఆ తర్వాత చేతులెత్తేశాడు. ఆ మరుసటి నెల నుంచి వేసిన రెండు చెక్కులు బ్యాంకులో నగదు నిల్వ లేక బౌన్స్ కాగా, అప్పటినుంచి కాంట్రాక్టర్‌కు తలనీలాల సరఫరాను నిలిపివేసి, అధికారులే భద్రపరుస్తున్నారు.
చెకులు బౌన్స్ కావడంతో న్యాయవాది ద్వారా కాం ట్రాక్టర్‌కు నోటీసులు పంపగా, ఆయన స్పం దించలేదు. దీంతో అధికారులు ఈ నెల 9న వేములవాడ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా వచ్చే నెల 13న హాజరు కావాలని కోర్టు ఆదేశించినట్టు అధికారులు తెలిపా రు. అయితే మరో మూడు చెకులు కూడా బౌన్స్ అయ్యాయని, బకాయిలు రూ.4 కోట్లకు చేరిన నేపథ్యంలో మరో కేసు కూడా వేస్తామని అధికారులు చెబుతున్నారు.