నాంపల్లి క్రిమినల్ కోర్టులు/హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు దాఖలు చేసిన పరువు నష్టం దావాలో మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఒక సినీ నటికి సంబంధించిన వ్యవహారంలో మంత్రి సురేఖ కేటీఆర్‌పై పూర్తి నిరాధారమైన, అసంగతమైన, అసత్యమైన ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన క్రిమినల్ పరువునష్టం దావా వేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మంత్రి సురేఖ శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ నెల 21లోపు సురేఖపై కేసు నమోదుచేసి ఆమెకు నోటీసు జారీచేయాలని జడ్జి శ్రీదేవి పోలీసులను ఆదేశించారు. కేటీఆర్‌పై నిందితురాలు నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఆయన తరఫు న్యాయవాది చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఫిర్యాదుదారుడు కేటీఆర్‌తోపాటు ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, టీవీల్లో ప్రసారమైన దృశ్యాలను కూడా పరిశీలించింది. సురేఖపై విచారణ చేపట్టిన అనంతరం ఈ కేసుకు సంబంధించి నిజానిజాలు వెలుగుచూస్తాయని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సత్యమేవ జయతే.. సత్యమే ఎప్పుడూ గెలుస్తుందని, వెంటనే కాకపోయినా, చివరికి తప్పకుండా నిజం వెలుగులోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కేసు నమోదుకు ఆదేశించడంపై కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. అధికారం ఉన్నదని ఎవరూ అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసి, ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హననం చేసి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ‘అధికారం అనేది ప్రజల జీవితాలను అపహాస్యం చేసే హకు కాదు.
ప్రత్యర్థులపై దూషణలు, పుకార్లు వ్యాప్తి చేసే సాధనం కూడా కాదు. అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశం’ అని పేర్కొన్నారు. రాజకీయ విమర్శల పేరుతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తూ తప్పించుకోవచ్చని భావించే వారికి నాంపల్లి కోర్టు తీర్పు ఒక గుణపాఠంగా నిలుస్తుందని తెలిపారు. ఇది సుదీర్ఘ న్యాయపోరాటమని, ఇంకా సగంలోనే ఉన్నామని, చివరి వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
నాపై కేసు నమోదు
కేటీఆర్ వేసిన పరువునష్టం దావాలో తనపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడం వాస్తవమేనని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. న్యాయ వ్యవస్థమీద తనకు అపారమైన గౌరవం ఉన్నదని పేర్కొన్నారు. ఈ కేసులు తనకు కొత్తకాదని, తన జీవితమే ఒక పోరాటమని తెలిపారు. ప్రైవేటు కేసులో కాగ్నిజెన్స్ తీసుకోమని కోర్టు తీర్పు ఇవ్వడం సర్వసాధారణమని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని తెలిపారు. కొంతమంది జర్నలిస్టులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. బిగ్ బ్రేకింగ్ పేరిట వార్తలను ప్రసారం చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.