హైదరాబాద్, సెప్టెంబర్ 8 ( నమస్తే తెలంగాణ ) : తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. భద్రత లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారడానికి పోలీసుశాఖ ‘నమస్తే తెలంగాణ’కు వివరణ రూపంలో ఇచ్చిన గణాంకాలే అద్దం పడుతున్నాయి. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిలో గత శనివారం ‘అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు’ శీర్షికన.. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, హోంమంత్రి లేక సమీక్షలు కుంటుపడిన వైనాన్ని కథనం రూపంలో ప్రచురించింది. ఈ కథనంలో వాస్తవాలు లేవంటూనే.. పోలీసుశాఖలోని సీఐడీ విభాగం సోమవారం అధికారికంగా ఇచ్చిన ఆరు నెలల గణాంకాల్లో మహిళలపై పెరిగిన నేరాలు, ఎస్సీ, ఎస్టీల పట్ల పెరుగుతున్న నేరాల తీవ్రతను ఎత్తిచూపాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నమోదైన పలు నేరాల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించినట్టు సీఐడీ విభాగం తన వివరణలో తెలిపింది. కాగా హత్యలు, లైంగికదాడులు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు వంటి కేసులు తగ్గినట్టు పేర్కొంది. నేరాల తగ్గుముఖంపై డీజీపీ జితేందర్ అర్ధవార్షిక క్రైమ్ రివ్యూలో పోలీసుశాఖ పనితీరును అభినందించినట్టు సీఐడీ విభాగం వెల్లడించింది.
‘తెలంగాణలో దోపిడీలకు పాల్పడుతున్న క్రిమినల్ గ్యాంగ్‌లపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక దృష్టిసారించాలి’ అని డీజీపీ జితేందర్ ఆగస్టు 7న నిర్వహించిన సమీక్షలో హెచ్చరించిన వారంరోజులలోపే హైదరాబాద్ నగరంలోని భారీగా పట్టపగలే దోపిడీలు జరిగాయి. ఇండ్లలోకి చొరబడిన దొంగల ముఠాలు బంగారం, నగదును ఎత్తుకెళ్లాయి. రాష్ట్రంపై పార్దీ గ్యాంగ్‌లు, చెడ్డి, భవేరియా వంటి గ్యాంగ్‌లపై దృష్టిపెట్టాలని ఆ రివ్యూలో ఉన్నతాధికారులు ఆదేశించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజలు భారీగా నగదు, నగలు కోల్పోయారు. క్రిమినల్ గ్యాంగ్‌ల నేరాలను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పినా.. పోలీసులు పెడచెవిన పెట్టడంతో పగలు, అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా తెలంగాణలో దొంగతనాలు జరుగుతున్నాయి. సీఐడీ విభాగం సోమవారం ఇచ్చిన వివరణలో ఇండ్లలో దోపిడీలు సుమారు 5శాతం పెరిగినట్టు తెలిపారు. ‘క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టు’ (నమ్మకద్రోహం, నయవంచన) కేసులు 18.66 శాతం పెరిగాయి.
సీఐడీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో మహిళల పట్ల నేరాల్లో పెరుగుదల కనిపించింది. మహిళలపై నేరాల్లో 2023 (జనవరి నుంచి జూన్)లో 10,848 కేసులు నమోదైతే.. 2024లో అదే సమయంలో 11,088 కేసులు, 2025 11,325 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నమోదైన నేరాల్లో వరకట్న మరణాల్లో 6.35% పెరుగుదల, ఆత్మహత్యలకు ప్రేరేపించిన కేసుల్లో 5.49% పెరుగుదల, వేధింపుల కేసుల్లో 2.61% పెరుగుదల, కిడ్నాప్ కేసుల్లో 5.19% పెరుగుదల కనిపించింది. మహిళల మర్యాదకు భంగం కలిగించిన కేసుల్లో 8.84% పెరుగుదల ఉన్నది. ప్రధాన నేరాల్లో తగ్గుదల కనిపించిందని చెప్తున్నా.. ఆ వివరాలను సీఐడీ విభాగం ఇవ్వలేదు. కేవలం తగ్గిన శాతాలను మాత్రమే ఆ విభాగం చూపించింది.
రాష్ట్రంలో నేరాల పెరుగుదలకు అనేక సామాజిక, ఆర్థిక కారణాలు ఉంటాయని సీఐడీ డీజీ చారుసిన్హా వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు, నిరుద్యోగం, పేదరికం వంటివి నేరాలకు దారితీస్తాయని తెలిపారు. అలాగే, యువతలో పీర్ప్రెషర్, త్వరగా డబ్బు సంపాదించాలనే కోరిక, మత్తు పదార్థాల వాడకం, సరైన విద్య లేకపోవడం వంటివి కూడా నేరాల పెరుగుదలకు కారణాలుగా ఆమె పేర్కొన్నారు. వీటిని కేవలం పోలీసుల పనితీరు సరిగా లేకపోవడం వల్లనే జరుగుతున్నాయని అనడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల భద్రత, శాంతిభద్రతలను కాపాడటంలో ముందంజలో ఉన్నామని తెలిపారు.