రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తమని చెప్పి పైసలు అడిగే వాళ్ల చెంప పగులగొట్టండని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. పేదల కండ్లల్లో ఆనందం చూడటమే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. అందుకోసం నయా పైసా అడగకుండా అన్ని వసతులతో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్నారని స్పష్టంచేశారు. ఇవే ఇండ్లు ప్రైవేటు బిల్డర్లు కడితే రూ.25 లక్షలకు పైగా ఖర్చవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అర్రలు కట్టించి పేదలను ఆగం చేశాయని.. కట్టుకొన్న ఇండ్లకు బిల్లులు ఇవ్వడానికి లంచాలు వసూలు చేసి దివాళా తీయించాయని ఆరోపించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, సిరిసిల్ల, గంభీరావుపేట మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ముస్తాబాద్‌లో రూ.9.80 కోట్లతో నిర్మించిన 156 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా లబ్ధిదారులకు భోజనం వడ్డించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే రాష్ట్ర సర్కారు లక్ష్యమని, వారి చిరకాల స్వప్నం సాకారం చేసేందుకే రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. విప్లవాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పష్టంచేశారు.
ఇన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా?
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి వినూత్న పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏడున్నర దశాబ్దాల కాలంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన రాష్ట్రం దేశంలో ఏదైన ఉన్నదా? అని ప్రశ్నించారు. అభివృద్ధి విజన్ ఉన్న సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న వారికి దమ్ముంటే 28 రాష్ర్టాల్లో ఎక్కడైనా రైతుబంధు, రైతుబీమా, డబుల్బెడ్రూం ఇండ్లు ఉన్నాయో చూపెట్టాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకునే సంస్కారవంతమైన సర్కారు ఉందా? అని నిలదీశారు. రోడ్లపైన తిరుగుతూ పొద్దువోక కేసీఆర్‌పై, ఆయన ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరని మండిపడ్డారు. మతం ముఖ్యం కాదని.. అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం నిర్మించి ఇవ్వాలన్నదే సీఎం లక్ష్యమని, అందరికీ తప్పకుండా ఇండ్ల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చే వరకు కేసీఆర్ వెనుకడుగు వేయరని స్పష్టం చేశారు.
65 లక్షల రైతు కుటుంబాలకు రూ.50 వేల కోట్లు
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతుబంధు పథకం కింద రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.50 వేల కోట్లు చెల్లించినట్టు వెల్లడించారు. 10లక్షల మంది ఆడబిడ్డల పెం డ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.8,500 కోట్లు అందించినట్టు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ అనురాగ్ జయంతి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎంపీపీ జనగామ శరత్‌రావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పాల్గొన్నారు.
అడిషినల్ పీఎస్‌కు కేటీఆర్ పరామర్శ
హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అడిషినల్ పీఎస్‌గా పనిచేస్తున్న గడ్డం శ్రీనివాస్ మాతృమూర్తి సుభద్ర ఇటీవల మృతిచెందారు. ఈ క్రమంలో సోమవారం సిరిసిల్లలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుభద్ర చిత్ర పటం వద్ద నివాళులర్పించారు.
– సిరిసిల్ల కలెక్టరేట్