హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): సిక్కిం ప్రభుత్వ తరహాలోనే తెలంగాణలోనూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్‌ను అమలు చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం (సీపీఎస్‌టీఈఏ) ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ను అమలు చేయాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాముక కమలాకర్, చీటి భూపతిరావు కోరారు. ఓపీఎస్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడదని, అదే సీపీఎస్ వల్లే ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందని పేర్కొన్నారు. దేశంలో ఒక్కొక్కటిగా రాష్ర్టాలు సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తూ, పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తున్నాయని, రేవంత్‌రెడ్డి సర్కారు సైతం పార్లమెంట్ ఎన్నికలకు ముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.