హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): సమగ్ర కులగణన సర్వే గడువును పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్ ప్రకటనలో కోరారు. ఇప్పటి వరకు సర్వే 58శాతమే పూర్తయ్యిందని తెలిపారు.
75 అంశాలు, 100 గడులను కోడ్ రూపంలో పూరించేందుకు ఎన్యుమరేటర్లకు సమయం పడుతున్నట్టు పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లకు సగం నెల వేతనం పారితోషికంగా అందజేయాలని కోరారు.
కేజీఎంసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఖమ్మం సిటీ, నవంబర్ 18: విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనలో ఖమ్మం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (కేజీఎంసీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెహమాన్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి వివేక్‌కు గుండు కొట్టించిన విషయం విధితమే. యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన సీనియర్ విద్యార్థులతో కలిసి ఈ తరహా చర్యలకు పాల్పడటం చర్చనీయాంశమైంది.
విషయం ఆలస్యంగా బయటికి పొక్కడంతో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు నివేదిక ప్రకారం డీఎంఈ సోమవారం సాయంత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెహమాన్‌ను సస్పెండ్ చేశారు.