హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్)కు వ్యతిరేకంగా ఆదివారం హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించనున్నారు. ‘యూపీఎస్‌పై యుద్ధభేరి’ పేరుతో ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ఈ ధర్నాకు రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా తరలిరావాలని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని సీపీఎస్ఈయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. యూపీఎస్‌ను ఆమోదిస్తూ జనవరి 24న కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీచేసిందని గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితమని చెప్పిన ఈ స్కీంను అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చర్చలు జరుపుతోందని ఆరోపించారు. 2004లో సీపీఎస్‌ను అమలు చేసినప్పుడు పీఎఫ్ఆర్డీఏ మార్కెట్ ఏజెన్సీగా వ్యవహరించి ఉద్యోగుల భవిష్యనిధిని షేర్ మార్కెట్పాలు చేసిందని మండిపడ్డారు.
రాష్ర్టాల హక్కులను హరించేలా కేంద్ర ఆర్థికశాఖ లోపభూయిష్టంగా యూపీఎస్‌ను రూపొందించిందని, ఈ స్కీంతో రాష్ర్టాలపై అధిక పెన్షన్ భారం పడుతుందని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఎస్ఈయూ రాష్ట్ర కోశాధికారి నరేశ్‌గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు పాల్గొన్నారు.