హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తేతెలంగాణ): బెటాలియన్ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇటీవల పలువురు కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్ను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బెటాలియన్ కానిస్టేబుళ్లతోపాటు వారి కుటుంబసభ్యుల న్యాయమైన డిమాండ్లను పరిషరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రికార్డు పర్మిషన్కు సంబంధించిన జీవో వల్ల బెటాలియన్ కానిస్టేబుళ్లపై పనిభారం పెరుగుతున్నదని, నిరంతరాయంగా 26 రోజులు పనిచేయాల్సి వస్తుండటంతో దాదాపు నెల రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తున్నదని తెలిపారు. దీని ఫలితంగా ఇటీవల పలువురు కానిస్టేబుళ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. బెటాలియన్ కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులు ఇష్టం వచ్చినట్టు డ్యూటీలు వేయడంతోపాటు వారితో ఇండ్లలో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని తెలిపారు. అయినప్పటికీ బెటాలియన్ కానిస్టేబుళ్లకు ప్రభుత్వం అదనపు ప్రయోజనాలను కల్పించడం లేదంటూ తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు.