నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా చర్చకు తెర లేపిందని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. దీనికున్న ప్రాధాన్యత దృష్ట్యా బీజేపీని ఓడించాల్సిన ఆవశ్యకత ప్రగతిశీల శక్తులపై పడిందన్నారు. నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డితో వామపక్షాల సమావేశం ముగిసిన అనంతరం చెరుపల్లి సీతారాములు మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బీజేపీని ఓడించగల శక్తి సామర్ధ్యాలు ఒక్క టీఆర్ఎస్కే ఉందన్నారు. ఈ నేపథ్యంలో మునుగోడులో జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను బలపరచాలని సీపీఎం నిర్ణయించిందని ఆయన ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.