Tammineni Veerabhadram | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తేతెలంగాణ): లగచర్ల ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తేల్చిచెప్పారు. ఇలాంటి చర్యలు రాజకీయ పార్టీలకు శ్రేయస్కరం కాదని హితవు పలికారు. భూములు కోల్పోతున్నామని ఆవేదనతోనే అధికారులపై రైతులు దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి, కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలపైనే కేసులు పెట్టి, జైలుకు పంపడమేమిటని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు పోలీసులకు తగదని పేర్కొన్నారు. అధికారులపై దాడి ఘటనలో భూములు కోల్పోతున్న అన్ని పార్టీల రైతులు ఉన్నారని తెలిపారు.
లగచర్ల సమస్య ప్రభుత్వానికి, ఐదు గ్రామాల రైతులకు మధ్య నెలకొన్నదని తెలిపారు. ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనుల భూములను బలవంతంగా లాక్కోవడం ప్రభుత్వానికి మంచిది కాదని, పంట భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటును సీపీఎం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అందరి ఆమోదంతోనే ప్రభుత్వం భూ సేకరణ జరపాలని సూచించారు. కలెక్టర్, అధికారుల బృందంతో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వస్తున్నారనే విషయమే తమకు తెలియదని లగచర్ల గ్రామస్థులు పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రైతులపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరారు.