హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మత్స్య పరిశ్రమలో మధ్య దళారీలకు తావులేకుండా.. మత్స్య సొసైటీలు స్వయం సవృద్ధి సాధించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు. శుక్రవారం ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. గత ప్రభుత్వం సుమారు రూ. 560కోట్లతో ఉచిత చేప,రొయ్య పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించిందని తెలిపారు. కానీ, ఆ తర్వాత పథకం అమలులో జరుగుతున్న లోపాలతో నిజమైన మత్స్యకారులకు లబ్ధి చేకూరడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనందున వెంటనే ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌చేశారు.