హైదరాబాద్/హిమాయత్‌నగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ఇది భావవ్యక్తీకరణపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఎన్ఐఏ అధికారులు ఇన్నయ్యను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయనపై ఉపా కేసు పెట్టడం సమంజసం కాదని చెప్పారు.
తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ అనేక మంది అనాథ పిల్లలను చేరదీసి, వారికి పెండ్లి సైతం చేసిన గొప్ప వ్యక్తి గాదె ఇన్నయ్య అని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.