హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మలాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ కాలనీల్లోని సుమారు 992 వాణిజ్య సముదాయాలను విక్రయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నివాసితుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నదని మండిపడ్డారు. వాణిజ్య దుకాణాలను ఈ నెల రెండో వారంలోగా వేలం వేస్తున్నట్టు జిల్లా కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారని గుర్తుచేశారు. విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును డిపాజిట్ చేసి, ఆ వడ్డీతో కాలనీల మెయింటెనెన్స్‌కు ఖర్చు చేస్తామనే ప్రభుత్వ ఆలోచన ఆచరణాత్మకంగా సాధ్యంకాదని స్పష్టంచేశారు. ఇండ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు, అసంపూర్ణంగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.