హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడమే కాకుండా, తెలంగాణ ఆడబిడ్డలతో పోటీదారుల కాళ్లు కడిగించడం ఎంతో అవమానకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రపంచ సుందరి పోటీదారులు వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రభుత్వం అక్కడి పూరిగుడిసెలను తొలగించి, చిరువ్యాపారులు లేకుండా చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి దిగజారిన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నదో అనేందుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే క్షమాపణ చెప్పాలని, దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.