గద్వాల అర్బన్, జూన్ 9 : ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులను అక్రమంగా అరెస్టు చేశారని, వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకుంటారా..? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నిలదీశారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామానికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకొని గద్వాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీస్‌స్టేషన్ ఎదుట అఖిలపక్షం నాయకులు బైఠాయించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్ధమైన యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిందని గుర్తుచేశారు. అధికారపార్టీ నాయకులు దగ్గరుండి రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు.
గద్వాల జిల్లా రాజోళీ మండలం పెద్దధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న 12 గ్రామాల రైతులు, రిమాండ్‌లో ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించడానికి పెద్దధన్వాడ గ్రామానికి వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు, రాష్ట్ర కమిటీ సభ్యులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. వారంరోజులుగా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించింది. మరియమ్మ అనే దళిత మహిళను పోలీసులు తీవ్రంగా కొట్టడమే కాకుండా, 46మంది రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిర్బంధాలు రాష్ట్ర ప్రభుత్వానికి తగదని పేర్కొన్నది. నిరుడు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకోవడం దారుణమని మండిపడింది. జైల్లో పెట్టిన రైతులను బేషరతుగా విడుదల చేసి, గ్రామాల్లో పోలీస్ పికెటింగ్‌లు ఎత్తివేయాలని కోరింది. మరియమ్మపై దాడిచేసిన పోలీసులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.