హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : సీపీఎం సీనియర్ నేత, తొమ్మిదిసార్లు ఎంపీగా గెలుపొందిన కమ్యూనిస్టు వాసుదేవ ఆచార్య (81) కన్నుమూశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆయన కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వాసుదేవ ఆచార్య భార్య కూడా ఇటీవలే మరణించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. పశ్చిమబెంగాల్లోని పురూలియాలో 1942 జూలై 11న వాసుదేవ ఆచార్య జన్మించారు. ఆచార్య..1980 నుంచి 2014 మధ్య లోక్‌సభకు 9 సార్లు ఎన్నికయ్యారు.
ఎంపీగా ఉన్న సమయంలో పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. 25 ఏండ్లపాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించారు. పలు కార్మిక ఉద్యమాలకూ నేతృత్వం వహించారు. వాసుదేవ ఆచార్య మృతి పట్ల సీపీఎం కేంద్ర కమిటీతో పాటు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీలు సంతాపం ప్రకటించాయి. కార్మికులు, ఉద్యోగుల సమస్యలు, హక్కులపై పార్లమెంట్లో తనదైనశైలిలో తన గళం వినిపించారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వాసుదేవ ఆచార్య అంత్యక్రియలు బెంగాల్‌లోని ఆయన సొంత గ్రామంలో జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.