జనగామ, డిసెంబర్10 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా చిల్పూర్ మండలం కిష్టాజీగూడెం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సీపీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కడియంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు మారిన కడియం సీపీఎంను విమర్శించడం తగదన్నారు. తన రాజకీయ ఎదుగుదలలో సీపీఎం సహకారం ఉందన్న సంగతి మరిచిపోయి పార్టీని, కార్యకర్తలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని తెలిపారు.