హైదరాబాద్ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) లేకుంటే దేశంలో బీజేపీనే లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈడీతో భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తున్నదంటూ ఆరోపించారు. ఈడీ లేకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలే కూలిపోతాయన్నారు. ఈడీ ఇంకా తమదాకా రాలేదని, వచ్చినా ఆశ్చర్యపోయేదేం లేదని చెప్పారు. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికవాద ప్రజాహక్కుల పరిరక్షణ జరగాలనీ, బీజేపీని అధికారానికి దూరం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో ఆదివారం పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, డీజీ నర్సింహారావు, చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. 1948 ఫిబ్రవరి 4 నుంచి 1949 జులై 11 వరకు దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిషేధాన్ని విధించారని, ఇప్పుడు ఆయన్ని తమ సొంత మనిషి అన్నట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటూ చరిత్రను వక్రీకరిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లిం ఘర్షణగా మార్చి, ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని సీతారం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. 1948లో నిజాం నవాబుతో పాటు కాశ్మీర్ రాజు హరిసింగ్ కూడా తమ దేశాలను భారతదేశంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారని గుర్తుచేశారు. విచిత్రంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక హరిసింగ్ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించారని, ఇక్కడి నిజాం నవాబుకు మతం ముసుగు తొడిగి ప్రజల్ని విడగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు.
మతోన్మాద అజెండాతో చరిత్రను పునర్లిఖితం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 1946లో ప్రారంభమై, 18 నెలలు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మూడువేల గ్రామాలు, 16వేల చదరపు కిలోమీటర్ల భూమి నిజాం సర్కారు నుంచి విముక్తమై.. పేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని వివరించారు. హైదరాబాద్ సంస్థానాన్ని కమ్యూనిస్టులు ఆక్రమిస్తారనే భయంతో, నిజాం నవాబు ఇండియన్ యూనియన్‌లో లొంగిపోవడానికి అంగీకరిస్తేనే భారత సైన్యం ఇక్కడకు వచ్చిందని చెప్పారు. లొంగుబాటు పూర్తయ్యాక కూడా భారత సైన్యం 1951 వరకు ఇక్కడే ఉండి, భూస్వాముల్ని మళ్లీ ఇక్కడ పునఃస్థాపన చేసి వెళ్లాయని గుర్తుచేశారు. 1950 మార్చి 27 నాటికి 4,482 మంది కమ్యూనిస్టులు జైళ్లలో ఉంటే, 57మంది రజాకార్లు మాత్రమే జైళ్లలో ఉన్నారని తెలిపారు. వీరోచితమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ ముస్లింలపై యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అన్నారు.
బీజేపీని గద్దె దింపితే, ఆయా రాష్ట్రాల్లో అన్ని లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చెప్పారు. ఈ నెల 25న హర్యానాలో దేవీలాల్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ర్యాలీకి వామపక్ష పార్టీలను ఆహ్వానించారని, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూడా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ పార్టీ పెట్టుకునే హక్కు ఉందన్నారు. బీజేపీ మతోన్మాద, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంపై వివరించారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీనే తమకు ప్రథమ శత్రువని, దాన్ని ఓడించడమే తమ ముందున్న తక్షణ రాజకీయ అవసరమని తేల్చిచెప్పారు.