హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్, పేదల భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీలను భర్తీచేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం ట్యాంక్‌బండ్, చార్మినార్‌ల వద్ద అంబేదర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల అమలు కు కావాల్సిన నిధులను ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించలేదని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం కంటే మనుధర్మ శాస్త్రాన్నే ముందుకు తెస్తున్నదని తెలిపారు.
దళితులు కుల వివక్షతకు, దాడులకు, హత్యలకు గురవుతున్నారని ఆరోపించారు. అగ్రకుల పేదలకు కూడా రిజర్వేషన్లు అమలవుతున్న తరుణంలో.. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసి, రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటానికి లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.